భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు కేసుల సంఖ్య రోజుకు 3.50 లక్షలకు పైగా ఉండేది. అయితే తాజాగా రోజుకు 4 లక్షల కేసులు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో రోజువారీ కేసుల సంఖ్య 10 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిలో భారత్‌లో ఏం చేస్తే కరోనా ఉధృతి తగ్గుతుందనే విషయంపై అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ కీలక విషయాలను వెల్లడించారు.
చైనాలో కోవిడ్ విజృంభించగానే అక్కడ మొత్తం లాక్‌డౌన్ చేశారు. భారత్‌లో ప్రస్తుతం పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంది. కనుక భారత్‌లోనూ లాక్‌డౌన్ విధించాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో భారత్‌లో లాక్‌డౌన్ విధించడం కన్నా వేరే మార్గం కనిపించడం లేదు. కొన్ని వారాల పాటు అయినా సరే లాక్‌డౌన్ విధిస్తే కరోనా ఉధృతి చాలా వరకు తగ్గుతుంది.. అని ఫౌచీ అన్నారు.
ఇక భారత్‌లో వైద్య సదుపాయాల కొరత ఉందని, కానీ చైనా మాదిరిగా వేగంగా హాస్పిటల్స్‌ను నిర్మించి కోవిడ్ చికిత్స అందిస్తే పరిస్థితులు మెరుగు పడుతాయని అన్నారు. అలాగే వీలైనంత ఎక్కువ మందికి రోజూ టీకాలను వేయించాలని అన్నారు. ఈ పనులు చేస్తే కోవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని ఫౌచీ తెలిపారు.