ఏపీ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ మిశ్రాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. విజయవాడలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహంలో ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్‌తో సీఎం జగన్ తొలిసారి ప్రత్యేకంగా సమావేశం కానుండటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే జగన్ అధికారంలోకి రాగానే ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా దానికి సంబంధించిన బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
అయితే కొన్ని లోపాలను సరిదిద్దుకొని మరోసారి మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడుతామని.. జగన్ సర్కార్ మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది. అయితే మూడు రాజధానుల్లో కర్నూలు జిల్లాను న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్న సీఎం జగన్ .. నేడు హై కోర్టు జస్టిస్ తో హైకోర్టు తరలింపుకు సంబంధించి సీజేఐతో చర్చించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇదిలా ఉంటే.. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఇప్పటికే ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ కానున్నారు. రేపు గవర్నర్ బిశ్వభూషణ్ విజయవాడకు చేరుకుంటారు.