మునుగోడు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో పార్టీలు దూకుడు పెంచాయి. నవంబర్ 1న సాయంత్రం 6 గంటలకు ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ చండూరులో సీఎం కేసీఆర్ సభ జరగనుంది. అయితే మోయినాబాద్ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ లో ఆడియో లీక్స్ తో పార్టీకి మంచి మైలేజ్ వచ్చిందని టిఆర్ఎస్ భావిస్తుంది.
ఇదే అంశాన్ని ఇవాళ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫామ్ హౌస్ ఘటనలో అందరికీ తెలియని కొన్ని నిజాలను సీఎం కేసీఆర్ ఇవాళ బహిరంగ సభలో బయటపెడతారని.. ఫామ్ హౌస్ డీల్ ను జాతీయస్థాయికి తీసుకెళ్లి జాతీయ స్థాయిలో బీజేపీని ఇరుకునపెట్టే ప్లాన్ లో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫార్మ్ హౌస్ ఎపిసోడ్ అంతా డ్రామా అని బిజెపి మండిపడుతుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి లో ప్రమాణం చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని బిజెపి భావిస్తోంది.