హైదరాబాద్: ఇవాళ హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు జరగనున్నాయి. సోమవారం రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆషాఢ మాసంలో జరిగే చివరి బోనాలు కావడంతో ఓల్డ్ సిటీ ప్రాంతం కళకళలాడుతోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఈ రోజు బోనాలు జరగనున్నాయి. లాల్‌దర్వాజలో భక్తులకు అన్ని సౌకర్యాలను ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. రంగం కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున పక్కాగా ఏర్పాట్లు చేశారు. సింహవాహిని అమ్మవారికి ముందుగా ఆలయ కమిటీ అధికారులు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. వచ్చే ఆదివారం గోల్కండ బోనాలతో హైదరాబాద్‌లో వేడుకలు ముగుస్తాయి.
మరోవైపు బోనాల సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు రోజులు పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తుల సౌకర్యం కోసం పార్కింగ్ ఏరియాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హోంగార్డు నుంచి సీపీ వరకు బోనాల బందోబస్తులో పాల్గొననున్నారు.