ఇవాళ్టి నుంచి సినిమా షూటింగ్ లు బంద్ కానున్నాయి. సినిమా చిత్రీకరణల బంద్ నిర్ణయానికి తెలుగు చలన చిత్రవాణిజ్య మండలి అంగీకారం తెలిపింది. నేటి నుంచి కొత్త చిత్రాలతోపాటు ఇప్పటికే సెట్స్‌పై ఉన్న సినిమాల చిత్రీకరణలన్నీ నిలిచిపోనున్నాయి. ఇతర భాషలకి చెందిన సినిమాల చిత్రీకరణలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి.
ఆదివారం హైదరాబాద్‌లో చలన చిత్ర వాణిజ్య మండలి సర్వసభ్య సమావేశం జరిగింది. 48 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు చిత్రీకరణలు ఆపేద్దామన్న యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యుల అభిప్రాయానికి చలన చిత్ర వాణిజ్య మండలి ఆమోదం తెలిపింది. కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమని వైఫల్యాలు పట్టి పీడిస్తున్నాయి. ప్రేక్షకులు రాక థియేటర్లు వెల వెలబోతున్నాయి.
‘‘నిర్మాతలంతా కలిసి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం. చిన్న, పెద్ద నిర్మాతలు అందరూ దీనికి ఆమోదం తెలిపారు. కొవిడ్ తర్వాత చాలా మార్పులొచ్చాయి. మారుతున్న ఈ పరిస్థితులపై చర్చించుకుంటూ, ప్రస్తుతం నెలకొన్న సమస్యలకి ఒక్కొక్కటిగా పరిష్కారం కనుక్కుంటూ ఆ తర్వాత చిత్రీకరణలు మొదలు పెడతాం. ఆగస్టు 1 నుంచి తెలుగు సినిమా చిత్రీకరణలేవీ జరగవు’. – నిర్మాత దిల్‌రాజు
‘నిర్మాతలు, పంపిణీదారులు ఆర్థికంగా నష్టాల్ని ఎదుర్కొంటున్నారు. టికెట్ ధరలు, వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీజు) ఛార్జీలు, ఓటీటీ వేదికల్లో సినిమాల విడుదల, కార్మికుల వేతనాలు… ఇలా పలు రకాల సమస్యలు పరిశ్రమని వెంటాడుతున్నాయి. నిర్మాతలు మొదలుకొని పంపిణీదారులు, ప్రదర్శనకారుల వరకు ఎవ్వరూ సంతోషంగా లేరనే అభిప్రాయాలు సర్వసభ్య సమావేశంలో వ్యక్తమయ్యాయి. సమస్యల పరిష్కారం కనుక్కొన్నాకే చిత్రీకరణల్ని మొదలు పెట్టాలనే మెజారిటీ సభ్యుల నిర్ణయం మేరకు చిత్రీకరణల నిలిపివేత ఖరారైంది. కొన్ని రోజులుగా ఈ నిర్ణయంపై చిత్ర పరిశ్రమలో చర్చలు జరుగుతున్నాయి. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆధ్వర్యంలో నిర్మాతలు పలుమార్లు సమావేశమై చిత్రీకరణలు నిలిపేయాలనే నిర్ణయానికొచ్చారు. దీనికి చలన చిత్ర వాణిజ్య మండలి ఆమోదం తెలపడంతో ఆగస్టు 1 నుంచి సుమారు 40 చిత్రాలు ఆగిపోనున్నట్టు తెలుస్తోంది.’
– వాణిజ్య మండలి అధ్యక్షుడిగా కె.బసిరెడ్డి