జీతాలు వచ్చాయి
కొత్త పే స్లిప్పులు వచ్చాయి
కానీ అవేవీ నచ్చడం లేదు ఉద్యోగులకు
ఇంటి భత్యం ఇరవై శాతం నుంచి ఎనిమిది శాతానికి తగ్గించారని, అదే విధంగా గతంలో తాము పోరాడి సాధించినవి అన్నీ రద్దు చేశారని ఉద్యోగులు మండిపడుతున్నారు.జగన్ ను నమ్మి మోసపోయాం అని అంటున్నారు కూడా!
కొత్త పీఆర్సీ ప్రకటన కారణంగా ఉద్యోగులు మండిపడుతున్నారు.తమకు అన్యాయం జరిగిందని బాధపడుతున్నారు. జగన్ ను నమ్మి మోసపోయామని వేదన చెందుతున్నారు. దీనిని జగన్ అర్థం చేసుకోవడం లేదు. ఆయన ఇష్యూ చేసిన చీకటి జీఓలను రద్దు చేయడం లేదు. దీని కారణంగా ఇవాళ ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. కానీ తాను చెప్పిందే వేదం అన్న విధంగా జగన్ ఒంటెద్దు పోకడల కారణంగా ఇరు పక్షాల మధ్య దూరం పెరిగిపోతోంది.
చంద్రబాబు కన్నా కఠినంగా జగన్ బాబు ఉన్నాడు అని తేలిపోయింది. ఆ విధంగా ఆయన ఛలో విజయవాడ వద్దే వద్దని అంటున్నాడు. కరోనా కారణంగా నిరసనలు వద్దే వద్దని అంటూనే, ఎక్కడికక్కడ పోలీసు చర్యలను ప్రోత్సహిస్తున్నాడు. దీంతో ఉద్యోగులు దీన్నొక అవమానంగానే భావిస్తున్నారు. తమకు నోటీసులు ఇవ్వడం, నిర్బంధం విధించడం అన్నవి పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
ఇవాళ చలో విజయవాడ నిర్వహిస్తున్నారు ఆంధ్రాలో ఉద్యోగులు. తమకు కొత్త పీఆర్సీ వద్దని, ఆర్థికంగా అస్సలు లాభదాయకం కాదని వీరంతా నెత్తీ నోరూ మొత్తుకుంటూ రోడ్డెక్కనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి పోలీసుల అనుమతి లేదు. అదేవిధంగా ఎక్కడిక్కడ నిర్బంధకాండ అమలు అవుతోంది.మఫ్టీలో పోలీసులు ఉద్యోగులను నిలువరిస్తున్నారు. యూనిఫాంలో పోలీసులు ఉద్యోగులకు నోటీసులు ఇస్తున్నారు. కొందరు పోలీసులు నేరుగా ఉపాధ్యాయులు పనిచేస్తున్న పాఠశాలలకే వెళ్లి నోటీసులు ఇవ్వడం జగన్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెంపొందేలా చేస్తోంది.
మరోవైపు ఉద్యోగులు కూడా అదే పట్టుదలతో ఉన్నారు. తమ జీతాలను తగ్గించడం అన్యాయమని, అద్దెభత్యం అలవెన్సుల్లో కోతలు విధించడం తగదని, అదేవిధంగా ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇవ్వడం కూడా తగదని చెబుతూ సీఎం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ కారణంగా ఇవాళ విజయవాడ దద్దరిల్లిపోతోంది. ఒక్క విజయవాడే కాదు శ్రీకాకుళం మొదలుకుని అనంతపురం వరకూ దద్దరిల్లిపోనుంది. ముఖ్యంగా పోలీసుల తీరుపైనే విమర్శలు వస్తున్నాయి. వాళ్లంతా ఉద్యోగుల విషయమై నడుచుకుంటున్న తీరు ఏమీ బాగాలేదని,గౌరవ యంత్రాంగంలో అందరూ సమానమేనని గుర్తించాలని పలు సంఘాల నాయకులు హితవు చెబుతున్నారు.