సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బెంగాలీ నటి బిదిషా డి మంజుదార్ (21) ఆత్మహత్య చేసుకుంది. కోల్‌కతాలోని తన నివాసంలో ఈ రోజు ఉదయం ఆమె శవమై తేలింది. అలాగే తన చావుకు గల కారణాలు తెలుపుతూ ఒక సూసైడ్ నోట్‌ను కూడా రాసింది. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిదిషా.. కోల్‌కతాలోని తన అపార్ట్ మెంట్‌లో నాలుగేళ్లుగా నివాసం ఉంటుందన్నారు. ఆమెతోపాటు తన తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. అయితే ఆమె ఈ నెల 25వ తేదీన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని వారు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఇంటి తలుపులు బద్ధలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించగా.. బిదిషా ఉరేసుకుని వేలాడుతూ కనిపించిందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో సూసైడ్ నోట్ లభించిందన్నారు. ఈ మేరకు సన్నిహితులను, కుటుంబసభ్యులను విచారిస్తున్నామన్నారు.