ముంబై నుంచి జోధ్‌పూర్ వెళ్తున్న సూర్యనగరి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ ముంబైలోని బాంద్రా నుంచి జోధ్‌పూర్ వెళ్తున్నది. ఈ క్రమంలో పాలిలోని రాజ్‌కియావాస్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున 3.27 గంటల సమయంలో పట్టాలు తప్పింది. దీంతో ఎనిమిది బోగీలు బోల్తాపడిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మొత్తం 11 కోచ్‌లు ప్రమాదానికి గురయ్యాయని నార్త్ వెస్ట్రన్ రైల్వే సీపీఆర్‌వో తెలిపారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారని వెల్లడించారు. ప్రయాణికులను ప్రత్యేక బస్సుల్లో వారి గమ్య స్థానాలకు చేరవేస్తున్నామని తెలిపారు. రైలు మార్గంలో మరమ్మతులు మొదలుపెట్టామని చెప్పారు. ప్రమాదం నేపథ్యంలో ఆ మార్గంలో వెళ్లాల్సిన 12 రైళ్లను దారి మళ్లించామని, రెండు రైళ్లను రద్దు చేశామన్నారు. కాగా, మార్వార్ జంక్షన్ నుంచి బయలుదేరిన 5 నిమిషాల తర్వాత రైలు ఒక్కసారిగా కుదుపులకు లోనయిందని ఓ ప్రయాణికుడు చెప్పారు. తర్వాత రెండు మూడు నిమిషాల్లోనే పెద్ద శబ్ధం వచ్చి రైలు ఆగిపోయిందన్నారు. తేరుకొని చూస్తే 8 స్లీపరు క్లాస్ బోగీలు పట్టాలు తప్పి పడిపోయి ఉన్నాయని తెలిపారు. 15-20 నిమిషాల్లో అంబులెన్సులు ప్రమాద స్థలానికి చేరుకున్నాయని వెల్లడించారు.