ట్రిపుల్ ఆర్ అనే తుఫాను థియేటర్ల దగ్గర దుమ్ము రేపుతోంది..అలజడులు సృష్టిస్తోంది.. అభిమానులకు పండగ చేసుకోమని చెబుతోంది. ఇన్నేళ్ల కష్టం ఫలించిందన్న ఆనందంలో తారక్ ఉన్నారు. హైద్రాబాద్ లో కుటుంబ సమేతంగా సినిమా చూసి వచ్చి తన ఆనందం మాటల్లో చెప్పనని కొన్ని సైగలు చేసి, చేతులు ఊపుతూ, సక్సెస్ సింబల్స్ ను చూపుతూ వెళ్లారు. ఆ సమయంలో అభిమానుల సంబరాలకు అవధులే లేవు. అదేవిధంగా మెగాభిమానులు అయితే ఇంకా ఆనందంగా ఉన్నారు.
చరణ్ కెరియర్లో ఓ మైల్ స్టోన్ ఈ సినిమా అవుతుందని పదే పదే తాము అనుకున్నామని, అదే ఇవాళ నిజం అయిందని పేర్కొంటూ దర్శక ధీర రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో తారక్ – రామ్ చరణ్ చిత్రాలతో ముద్రించిన జెండాలను చేబూని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అభిమానులు బైక్ ర్యాలీలు తీశారు.నిన్న, ఈ రోజు వరుస రెండు రోజులూ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బైక్ ర్యాలీలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సినిమా విడుదలకు ముందు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు 150 యూనిట్ల రక్తాన్ని అందించారు తారక్ అభిమానులు.
అదేవిధంగా చరణ్ అభిమానులు కూడా రక్తదాన శిబిరం నిర్వహించి తమ వంతు సాయం చేశారు. బాధిత చిన్నారులకు న్యూట్రిషన్ ఫుడ్ అందించామని తారక్ అభిమానుల సంఘం ప్రతినిధి మాదారపు డేవిడ్ తెలిపారు. ఏటా ఎన్నో సార్లు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని, సినిమా విడుదలకు ముందు బైక్ ర్యాలీలు, సంబరాలు అన్నవి మామూలే అని వాటికి భిన్నంగా సామాజిక ప్రయోజనార్థం ఇటువంటి మంచి పనులు చేయడం ఎంతో ఆనందం ఇస్తుందని మాదారపు డేవిడ్ తెలిపారు.
ఇక సినిమా గురించి చెప్పాలంటే..ఒకటి కాదు రెండు కాదు మూడేళ్ల నిరీక్ష ఫలితం ఇచ్చిందని చెప్పకనే చెబుతోంది.. ఇదే ఇదే తెలుగు వాడి సత్తా అని! ఏళ్లకు ఏళ్లు నిరీక్షణ తరువాత ఇవాళ ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ అయింది. మంచి విజయాలను నమోదు చేస్తోంది. అనూహ్య రికార్డులను సొంతం చేసుకుంటోంది. చాలా రోజులకు అటు నందమూరి అభిమానులు,ఇటు రామ్ చరణ్ అభిమానులు కలిసి ఓ పెద్ద పండగ లాంటి వాతావరణాన్ని థియేటర్ల ఎదుట సృష్టించారు. సృష్టిస్తున్నారు కూడా !
మెగాభిమానులు, నందమూరి అభిమానులు ఒకరినొకరు అభినందించుకుని, చిత్ర విజయం సాధించిన నేపథ్యంలో శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. కొన్ని థియేటర్ల దగ్గర డప్పుల కోలాటాలు ఉదయం నాలుగు గంటల నుంచే మొదలయ్యాయి. రాత్రంతా థియేటర్ల దగ్గర అభిమానులు నిరీక్షించి నిరీక్షించి ట్రిపుల్ ఆర్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆతృతతో గడిపారు.
ఇక సినిమా థియేటర్ల దగ్గర అయితే జాతరే జాతర. సినిమా తమ ఊహలకు అందనంత ఎత్తులో ఉందని, చాలా అంటే చాలా బాగుందని ప్రతి ఒక్క ప్రేక్షకుడూ చెబుతున్నాడు. ముఖ్యంగా ఇద్దరు హీరోల మధ్య నడిచే సన్నివేశాలు అన్నీ మాటల్లో వర్ణించలేనంత గొప్పగా ఉన్నాయని అంటున్నాడు. అదేవిధంగా సినిమాలో విజువల్ గ్రాండీయర్ ఉందని, ప్రతిచోటా నిర్మాణ విలువలు కొట్టొచ్చిన విధంగా కనిపిస్తున్నాయని ఆనందిస్తూ అభిప్రాయపడుతున్నాడు. తాము ఇంతగా సినిమా వస్తుందని అనుకోలేదని, ఎన్నో భావోద్వేగాలు ఎన్టీఆర్ , చరణ్ సునాయాసంగా పలికించి మెప్పించారని వివరిస్తూ సంతోషంతో ఎగిరి గంతేస్తున్నాడు. ఓ విధంగా ఇవాళ థియేటర్ల దగ్గర పెద్ద పండుగ. మంచి సినిమా వస్తే సీజన్ తో సంబంధం లేదని చాటిన రోజు.
తారక్ – చరణ్ ద్వయం సాధించిన విజయానికి ఆరంభం ఈ రోజు.