తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ నాగార్జునసాగర్ ఉపఎన్నిక షెడ్యూల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి పోటీ చేస్తారన్న క్లారిటీ ఉన్నా.. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు టీఆర్‌ఎస్ ఎవరిని బరిలో దించుతుందో ఇంకా వెల్లడి కాలేదు. బీజేపీ వడపోతలు కొలిక్కి రాలేదు. ఏప్రిల్ నెలలోనే ఉపఎన్నిక ఉండొచ్చని అంచనా వేస్తున్న టీఆర్‌ఎస్ బలమైన అభ్యర్థిని బరిలో దింపడంపై కసరత్తు దాదాపుగా పూర్తి చేసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇటీవలే నాగార్జునసాగర్ టీఆర్‌ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ సైతం భేటీ అయ్యారు. దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ పోరులా కాకుండా ఇక్కడ రణతంత్రం మార్చబోతోందట అధికారపార్టీ. నాగార్జునసాగర్‌కే చెందిన స్థానిక బీసీ నేతను బరిలో దింపాలన్నది టీఆర్‌ఎస్ ఆలోచనగా తెలుస్తోంది. యాదవ సామాజికవర్గానికి చెందిన గురవయ్య బైఎలక్షన్ అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. గురవయ్య స్థానిక నేత.. దీనివల్ల లోకల్, నాన్‌లోకల్ సమస్య రాదన్నది గులాబీ నాయకుల లెక్క. అలాగే ఉపఎన్నిక టికెట్ ఆశించిన ఒకరిద్దరికి ఏదో ఒక రూపంలో పదవులు కట్టబెట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌కి గురవయ్య బంధువు. నాగార్జునసాగర్‌లో యాదవ సామాజికవర్గం ఎక్కువగా ఉంటుంది. గురవయ్య అభ్యర్థి అయితే కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇవ్వొచ్చనే ఆలోచనలో టీఆర్‌ఎస్ ఉందట. పార్టీ నేతలంతా కలిసి పనిచేస్తారని భావిస్తోంది. ఆర్థికంగా కూడా గురవయ్య యాదవ్ బలంగా ఉండటంతో అతనివైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే గురవయ్య యాదవ్ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి ఉపఎన్నికలో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు కూడా.
అభ్యర్థి ఎంపిక దాదాపు కొలిక్కి రావడంతో.. ఉపఎన్నికలో అనుసరించాల్సిన గెలుపు వ్యూహంపై టీఆర్‌ఎస్ దృష్టిపెట్టబోతున్నట్టు సమాచారం. ఉపఎన్నికను పర్యవేక్షించేది ఎవరు? మండలాలు, గ్రామాల వారీగా ఎన్నికల బాధ్యతలు చూసేవారి జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. అనూహ్యంగా గురవయ్య పేరు రేస్‌లో ముందుకు రావడంతో పార్టీ వర్గాలు కూడా ఆయన గురించి ఆరా తీస్తున్నాయి.