గ్రేటర్ మేయర్ అభ్యర్ది పై టీఆర్ఎస్ క్లారిటీ ఇచ్చేసిందా

-

గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌గా ఛాన్స్‌ టీఆర్ఎస్ లో ఎవరికి దక్కనుంది..రేపు జరిగే మేయర్‌ ఎన్నికపై అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. అధికారపార్టీలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులు కోసం ఆశావాహులు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి వ్యూహం మార్చిన టీఆర్ఎస్.. సీల్డ్‌ కవర్‌లో పేర్లు ఇచ్చేందుకు మొగ్గు చూపుతోంది…అయితే మేయర్ విషయంలో మాత్రం ఇప్పటికే కొంత క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది.

జీహెచ్‌ఎమ్‌సీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకునేదిశగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. గ్రేటర్ ఎన్నికలో టిఆర్ఎస్ 56 డివిజన్లు దక్కించుకుంది. 32 మంది ఎక్స్ అఫిషియో సభ్యుల బలం కూడా గులాబీ పార్టీకి ఉంది. దీంతో సాధారణ మెజార్టీతో మేయర్ పీఠం దక్కిం చుకోవచ్చని టిఆర్ఎస్ అంచనాకు వచ్చింది. ముందుగా పేర్లు ప్రకటిస్తే.. టిఆర్ఎస్ గెలుపుతో పాటు ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి.. ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలనే యోచనకు టీఆర్‌ఎస్‌ పార్టీ వచ్చినట్లు తెలుస్తోంది.

మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై దృష్టి పెట్టిన ఆశావాహులు ఇప్పటికే గట్టి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పార్టీ పెద్దలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే… గతంలో ముందుగానే మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ప్రకటించిన టిఆర్ఎస్ ఈ సారి పంథా మార్చింది. సీల్డ్ కవర్‌లో ఎన్నిక రోజు పేర్లు ఇస్తామని… అప్పుడే నామినేషన్లు దాఖలు చేయాలని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనితో ఆశావహులలో టెన్షన్ మొదలైంది.

ప్రస్తుతం మేయర్ రేసులో టిఆర్ఎస్ సీనియర్ నేత కేకే కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి, పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి, భారతీ నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. గ్రేటర్ మేయర్‌గా గద్వాల్ విజయలక్ష్మి పేరును టిఆర్ఎస్ అధిష్టానం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇటు డిప్యూటీ మేయర్‌గా మళ్ళీ మైనార్టీకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పార్టీ విప్ గా ప్రభాకర్ ని నియమించింది. అయితే గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల వ్యవహారం బాధ్యతలను కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news