ఒకరేమో కొన్నాళ్లు సంక్షేమ పథకాలు ఆపేద్దామంటారు..ఇంకొకరేమో అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రావంటారు.. టీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రి చేసిన ఈ కామెంట్స్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీని వెనక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా ? లేక నేతలు తడబడి తొందరపడ్డారా అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత వేడెక్కి చల్లారిన తెలంగాణ రాష్ట్ర రాజకీయాన్ని తమ కామెంట్స్‌తో మళ్లీ రగిలించారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి. ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో సందర్భం వేరైనా ఒకే విధంగా ఇద్దరు నేతలు పలికిన పలుకుల సారాంశం ఒకేలా ఉందని చర్చ జరుగుతోంది. కొందరైతే టీఆర్‌ఎస్ నాయకులు యథాలాపంగా ఈ కామెంట్స్ చేశారా.. లేక వీరి మాటల వెనక బలమైన కారణం ఏదైనా ఉందా అని ఆరా తీస్తున్నారు.
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేబినెట్‌లో ఆయనకు చోటు దక్కలేదు. అయినా తన అసంతృప్తిని ఎక్కడా బయటపెట్టలేదు. ఆయన పనేదో ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. పెద్దగా చర్చలో లేరు.. వార్తల్లోనూ లక్ష్మారెడ్డి పేరు నలగడం లేదు. రాజకీయాల్లో ఆచి తూచి మాట్లాడాతరని లక్ష్మారెడ్డికి పేరుంది. అలాంటి మాజీ మంత్రి చేసిన కామెంట్స్ టీఆర్‌ఎస్‌లోనే కాదు.. రాజకీయ వర్గాల్లోనూ కలకలం రేపాయి.
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాల ఎఫెక్ట్ పడిందో ఏమో.. వాటిని పరోక్షంగా ప్రస్తావిస్తూ సంక్షేమ పథకాలను ఎన్నికలకు ఏడాది ముందే ప్రారంభించాలి. మంచి చేస్తే జనాలు మర్చిపోతున్నారు అని లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష్మారెడ్డి శైలిలో చెప్పిన ఈ మాటలు సుతిమెత్తగా ఉన్నా.. రాజకీయ వర్గాలకు మాత్రం సుత్తితో కొట్టినట్టు తగిలాయట. ఈ అంశంపై ఒకవైపు వాడీవేడీ చర్చ జరుగుతున్న సమయంలోనే అదే జిల్లాకు చెందిన మంత్రి శ్రీనివాసగౌడ్ ఇంకో బాంబు పేల్చారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అందరికీ రాబోవన్నారు. కట్టే ఇళ్లే తక్కువ అని.. అవి కూడా లాటరీలో కేటాయిస్తామని చెప్పారాయన.
ఒక మాజీ మంత్రి పథకాలన్నీ ఇప్పుడే ఇవ్వొద్దని.. కొన్నాళ్లు ఆపేస్తే బెటర్ అని అంటే… ప్రస్తుత మంత్రి ఒకరు ఎక్కువ ఆశించకండి అని చెప్తారు. ఇలా ఇద్దరు లీడర్లు జనం మధ్య ఓపెన్ అయిపోయి ఏది పడితే అది మాట్లాడేయటంపై టీఆర్‌ఎస్‌లో చర్చ జరుగుతోంది. అసలు టీఆర్‌ఎస్ లీడర్లు ఎందుకింత తొందరపడుతున్నారు సీఎం కేసీఆర్ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు లాంటివాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. మరి.. వీరికేమైంది ఎందుకిలా మాట్లాడుతున్నారు.. టీఆర్‌ఎస్ అధిష్ఠానమే అలా మాట్లాడిస్తోందా..అన్ని పనులు ఇప్పటికిప్పుడే అవ్వవు కదా.. అన్నీ వెంటనే చేయలేమని చెప్పడానికే ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తున్నారా ఇలాంటి ప్రశ్నలపై పార్టీలోనే చర్చ జరుగుతోందట.
పైగా ముందస్తు ఎన్నికల సంకేతంగా కూడా కొందరు విశ్లేషణ చేస్తున్నారు. ఒకవేళ టీఆర్‌ఎస్ నేతలు తొందరపడి.. తడబడి ఉంటే పార్టీ పిలిచి క్లాస్ తీసుకుంటుంది. లేదంటే ప్రచారంలో ఉన్న అంశాలకు బలం చేకూరుతుంది. మరి.. ఈ ప్రకటనలపై ఏం జరుగుతుందో చూడాలి.