టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తొలిటర్మ్‌లో పార్టీ నేతలు క్రమశిక్షణతో ఉన్నట్టు కనిపించారు. ఏం మాట్లాడాలన్నా పార్టీ లైన్ ఏంటో తెలుసుకునేవారు. లేదా పార్టీ పెద్దలతో మాట్లాడి స్పందించేవారు. అప్పట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అదే పాటించేవారు. ఎవరూ గీత దాటేవారు కాదు. దీంతో మొదటి టర్మ్‌లో టీఆర్‌ఎస్‌కు పెద్దగా సమస్యలేం రాలేదు. కానీ రెండోసారి అధికారంలొకొచ్చాక క్రమశిక్షణ కట్టు తప్పుతుందా..మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు లేని ఈ పరిస్థితి.. రెండోసారి పవర్‌లోకి వచ్చాక ఎందుకు ఎదురైంది.
పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల మాట తీరు పొదుపుగా ఉంటుంది. కానీ.. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న తీరు మరోలా ఉంది. ఎమ్మెల్యేల వైఖరి అధిష్ఠానానికి ఇబ్బందికరంగా మారుతోంది. ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరుగా వివిధ అంశాలపై మాట్లాడుతున్న తీరు గులాబీ పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. క్రమశిక్షణ కట్టు తప్పిందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు ఎమ్మెల్యేలు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని కొందరు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ముందు ఏదోదో మాట్లాడేయటం.. విమర్శలు వచ్చాక.. తన మాటలను వక్రీకరించారని ఎమ్మెల్యేలు చెప్పడం మామూలైపోయింది.
ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో కాబోయే సీఎం కేటీఆర్ అని మంత్రులు, ఎమ్మెల్యేలు తెగ భజన చేస్తున్నారు. ఈ విషయంలో పోటీ పడకపోతే రేస్‌లో వెనక్కి వెళ్లిపోతామేమో అన్నట్టుగా సీనియర్లు, జూనియర్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. కేటీఆర్‌కు సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని కోరస్ ఇస్తున్నారు. ఇది పూర్తిగా టీఆర్‌ఎస్ అంతర్గత అంశమైనా.. ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలపై అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నాయి విపక్షాలు. పార్టీ నుంచి సంకేతాలు వచ్చి మాట్లాడుతున్నారో లేక తొందరపడి ప్రకటనలు ఇస్తున్నారో కానీ అందరినీ అటెన్షన్ తీసుకొస్తున్నారు.
కలాలు, గళాలు మౌనంగా ఉంటే సమాజానికి కేన్సర్ కంటే ప్రమాదమన్నారు మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. తెలంగాణ వచ్చి తర్వాత పాటలు వ్యక్తులు చూట్టు ఉంటున్నాయని మరో బాంబు పేల్చారు. అయోధ్య రామాలయం నిర్మాణానికి చేపట్టిన విరాళాల సేకరణపై ఇద్దరు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన కామెంట్స్ వివాదం రేపాయి. ముందుగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు వ్యాఖ్యలు కలకలానికి దారితీశాయి. ఆయన బీజేపీకి టార్గెట్ అయ్యారు. రాజకీయంగా విద్యాసాగర్‌రావు చేసిన కామెంట్స్ టీఆర్‌ఎస్‌ను ఇబ్బంది పెట్టాయట. మరో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సైతం ఇదే అంశంపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భద్రాచలంలో రాముడు లేడా.. మీరు కట్టే గుడి మాకేందుకు అని అయోధ్య ఆలయ నిధి సేకరణపై అభ్యంతరం తెలిపారు.
ఆ మధ్య అటవీ ఉద్యోగులను ఉద్దేశించి ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివాదం చల్లారింది అనుకుంటోన్న సమయంలో మరొకటి తెరమీదకు వస్తోంది. దీంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కట్టు తప్పి.. గీత దాటి మాట్లాడుతున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.