అధికార టీఆర్ ఎస్‌కు ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ఒక అభ్యర్థిని ఎంచుకోవడం పెద్ద తలనొప్పిగా మారింది. కో అంటే కోటి మంది పోటీ చేయడానికి రెడీగా ఉన్నా కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు కావడంతో అలాగే ఈటల లాంటి బలమైన నాయకుడిని, ఇంత వరకు ఆయనకు ఓటమి ఇచ్చిన నేతలే లేకపోవడంతో అనేక రకాలుగా తర్జన, భర్జనలు పడుతోంది టీఆర్ ఎస్ అధిష్టానం. ఇందులో భాగంగా అనేక మందిపై సర్వేలు చేయిస్తోంది.
ఇక ఎన్నో సర్వేలు చేయించిన తర్వాత హుజూరాబాద్‌లో ఈటలను ఢీకొట్టే సత్తా కౌశిక్‌రెడ్డికే ఉందని అనుకున్న అధిష్టానానికి కౌశిక్ రెడ్డి నోరుజారి అనవసరంగా చిక్కుల్లో పడిపోయాడనే చర్చ తలనొప్పిగా మారింది. దీంతో అసలు నియోజకవర్గంలో కౌశిక్ ఇమేజ్ డ్యామేజ్ అయిందనే ప్రచారం జరగడంతో ఆయనపై టీఆర్ఎస్ కూడా వెనకడుగు వేస్తోంది.
ఇక ఆయన కాకుండా ఇప్పుడు పార్టీలో చేరిన బీసీ నాయకుడు ఎల్.రమణ పేరు కూడా వినిపిస్తున్నా కూడా నాన్ లోకల్ క్యాండిడేట్ కావడంతో గెలవడం కష్టమని భావిస్తున్నారు. ఇక వీరే కాకుండా బీసీల్లో మంచి పట్టునన మాజీ బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేరు కూడా ప్రచారంలో ఉందని తెలుస్తోంది. అలాగే టీఆర్ఎస్ వీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు అయిన గెల్లు శ్రీనివాస్ ను కూడా దృష్టిలో పెట్టుకుంది టీఆర్ ఎస్. మరి కౌశిక్ ఇస్తారా లేదా బీసీ నాయకుడిని దించుతారా అన్నది మాత్రం చూడాలి.