కేంద్ర బడ్జెట్‌ పై టీఆర్ఎస్ మౌనం అందుకేనా

-

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు సరైన కేటాయింపులు లేవని తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రానికి మరోసారి మొండి చెయ్యి చూపించారని వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. గత బడ్జెట్ కేటాయింపుల పై అప్పటికప్పుడే ఫైర్ అయిన గులాబీ బాస్ ఎందుకు స్పందించలేదు..ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉన్న గులాబీ నేతలు ఎందుకు నోరు విప్పలేదు అన్నదాని పై ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చ నడుస్తుంది.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్

కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉందా.. సీఎం నుంచి అధికారుల వరకు బడ్జెట్ కేటాయింపుల పై ఎందుకు స్పందించలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో ఒక్కసారి కూడా తెలంగాణ అనే పదం పలకలేదని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నా కేంద్ర బడ్జెట్‌పై అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ స్పందించలేదు. గతంలో కేంద్రంపై ఎగిరెగిరిపడ్డ నాయకులంతా నోటికి తాళం వేసినట్టు ఎందుకు ముఖం చాటేశారు. మంత్రులు.. ఎంపీలు సైతం ఒక్కరి నోరు ఎందుకు పెగలడంలేదు.

కేంద్ర బడ్జెట్‌ పై అధికారపార్టీ సైలెంట్ అవ్వడం పై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. దీని వెనక కారణం ఏమై ఉంటుందా అని మరికొందరు ఆరా తీస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌పై ప్రతిసారి టీఆర్‌ఎస్‌ ఎంపీలు స్పందించేవారు. ముఖ్యమంత్రి సైతం సుధీర్ఘ సమీక్షలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసేవారు. గత బడ్జెట్‌ సమయంలో 4 గంటలు రివ్యూ చేసి కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి.తెలంగాణ పురోగతిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసేవారు సీఎం.

కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా నిష్పత్తిని తగ్గించడం, జీఎస్టీ పరిహారంపై, రాష్ట్రానికి కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని గతంలో కేంద్రాన్ని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ఈ దఫా మాత్రం సీఎంవో నుంచి కేంద్ర బడ్జెట్‌పై ఎలాంటి ప్రకటన రాలేదు. ఆర్థిక మంత్రి హరీష్‌రావు సైతం స్పందించలేదు. సీఎస్‌ రివ్యూ చేసినా పూర్తి వివరాలు తెలియజేయలేదు. సీఎం కేసీఆర్‌ నుంచి ఆదేశాలు రాకపోవడం వల్లే ఎవరూ కేంద్ర బడ్జెట్‌పై స్పందించలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇదే సమయంలో రాజకీయ వర్గాల్లో మరో చర్చ జరుగుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ వైఖరిలో మార్పు వచ్చిందని చెవులు కొరుక్కుంటున్నారు. సీఎం ఢిల్లీ పర్యటన తర్వాత పార్టీ, ప్రభుత్వం లైన్‌ మారిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆ తర్వాత రైతుల ఆందోళనకు మద్దతు విషయంలోనూ కేసీఆర్ వెనక్కి తగ్గారు. ఢిల్లీతో సఖ్యత కోసమే సీఎం రూట్‌ మార్చారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news