పీవీ కుమార్తె గెలిస్తే టీఆర్‌ఎస్‌కు రాజకీయంగా కలిసొస్తుందా ?

-

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మునుపెన్నడూ లేని విధంగా టీఆర్‌ఎస్‌ ఫోకస్ పెట్టింది. ఊహకందని విధంగా మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభివాణిని బరిలో దించినప్పటి నుంచి ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటోంది. ఇక్కడి పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ పీవీ కుమార్తెను శాసనమండలికి పంపితే పొలిటికల్‌గానూ మైలేజ్‌ వస్తుందని లెక్కలేస్తుంది.

టీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌లు స్వయంగా ఎప్పటికప్పుడు మూడు ఉమ్మడి జిల్లాల నేతలతో మాట్లాడుతున్నారు. ప్రచార సరళిని..ఎన్నికల వ్యూహాన్ని నిర్దేశిస్తూ ఆరా తీస్తున్నారు. ఈ పరిణామాలు అధికార పార్టీలోనూ వైరి పక్షాలలోను చర్చకు కారణం అవుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ఇప్పటి వరకు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని గెలవలేదు. కిందటి ఎన్నికల్లో ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్‌ను బరిలో దించినా ఆశించిన ఫలితం రాలేదు.

దుబ్బాక, గ్రేటర్ఎన్నికల తర్వాత బీజేపీ దూకుడుగా వెళ్తోంది. ఇది బీజేపీ సిట్టింగ్‌ స్థానం. అందుకే బీజేపీకి చెక్‌ పెట్టాలంటే టీఆర్‌ఎస్‌ గెలవాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా ఏడాదిపాటు నిర్వహిస్తోంది. ఇదే సమయంలో సురభివాణిని ఎమ్మెల్సీని చేస్తే అది టీఆర్‌ఎస్‌కు ప్లస్‌ అవుతుందనే లెక్కలు వేస్తుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే కేసీఆర్‌, కేటీఆర్‌లు ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని భావిస్తున్నారు.

మూడు ఉమ్మడి జిల్లాలకు ఎమ్మెల్సీ ఎన్నికల ఇంఛార్జులుగా మంత్రులను నియమించారు సీఎం కేసీఆర్‌. అభ్యర్థి సురభి వాణితో సంబంధం లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించి..టీఆర్‌ఎస్‌ గెలిచేలా పనిచేయాలని పార్టీ నేతలను, ప్రజా ప్రతినిధులను ఆదేశించారట అధినేత కేసీఆర్. విపక్షాల విమర్శలను తిప్పికొట్టి.. బీజేపీ సిట్టింగ్‌ స్థానాన్ని దక్కించుకోవాలని టీఆర్‌ఎస్‌ గట్టిగా కృషి చేస్తోంది.

పీవీ కుమార్తెకు ఓడిపోయే సీటు ఇచ్చారని ఇప్పటికే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అలాంటి విమర్శలను తిప్పికొట్టడంతోపాటు గెలిచి వైరిపక్షాలకు సమాధానం చెప్పాలని టీఆర్‌ఎస్‌ ఆలోచిస్తోంది. ఈ దిశగానే అధికారపార్టీలో చర్చ కూడా జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ గెలుపు అనేక ప్రశ్నలకు.. అనుమానాలకు జవాబు ఇచ్చినట్టు అవుతుందని టీఆర్‌ఎస్‌ లెక్కలేసుకుంటోంది. అందుకే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ స్థానంపై ఫోకస్‌ పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news