పండుగలు వచ్చాయంటే చాలు ఓవైపు ఆర్టీసీ.. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీలను అమాంతం పెంచేస్తాయి. ప్రయాణికులు జేబుకు చిల్లు పెడతాయి. అయితే ఈసారి తెలంగాణ ఆర్టీసీ ఇందుకు మినహాయింపు. పండుగ పూట కూడా సాధారణ ఛార్జీలే వర్తిస్తాయని స్పష్టం చేసింది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ అలా కాదు. సందు దొరికింది కదా అని కొందరు డబుల్, ట్రిపుల్ ఛార్జీలు వసూల్ చేస్తారు. ప్రయాణికుల అవసరాన్ని ఆసరా చేసుకుని డబ్బు దండుకుంటారు. ఇలా ఇష్టారాజ్యంగా ఛార్జీల దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు తెలంగాణ రవాణా శాఖ అడ్డుకట్ట వేయనుంది.
సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 4 వరకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, కార్లు, మ్యాక్సీ కాబ్‌లను రవాణా శాఖ అధికారులు ముమ్మరంగా తనిఖీ చేయనున్నారు. శనివారం నుంచి ఎల్బీనగర్, ఆరాంఘర్, ఐఎస్‌సదన్, జేబీఎస్, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరగనున్నాయి. అక్రమంగా ప్రయాణికులను తరలించే ప్రైవేటు వాహనాలపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చేసిన విజ్ఞప్తి మేరకు ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కోదాడ, సిద్దిపేట, షాద్‌నగర్‌లోని చెక్‌పోస్టుల వద్ద రవాణా శాఖ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు చేపట్టనున్నారు.
దసరా సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు 18 లక్షల మంది ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్లనున్నారన్న అంచనాతో కర్నూలు, విజయవాడ మార్గాలను రవాణా శాఖ అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు. ప్రయాణికుల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ ఇబ్బడిముబ్బడిగా ఛార్జీలు వసూల్ చేయకుండా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. అక్రమాలకు పాల్పడుతున్నారని రుజువైతే.. వెంటనే వాహనాలను స్వాధీనం చేసుకొని, వాటిలోని ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో పంపించనున్నారు.