శ్రీవారి భక్తులకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి శుభవార్త చెప్పారు. సర్వదర్శనం భక్తులకు ఇకపై ఎలాంటి నిరీక్షణ లేకుండా గంటరన్న వ్యవధిలోనే దర్శన సౌకర్యం కల్పించనున్నట్టు ఆయన వెల్లడించారు. రద్దీకి అనుగుణంగా సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్టు, శుక్ర, శని, ఆదివారాల్లో ప్రొటోకాల్ మినహా వీఐపీ బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలను తీసుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన నిధులతో 150 కొత్త ఆలయాలను నిర్మించనున్నట్టు చెప్పారు. అలాగే, దాదాపు 100 పురాతన ఆలయాలకు నిధులు కేటాయించినట్టు తెలిపారు.
మరో 500 ఆలయాలను పునరుద్ధరించాలని నిర్ణయించినట్టు, తిరుమలలో దళారీ వ్యవస్థను నిరోధించడం ద్వారా రూ. 215 కోట్లు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా స్వామి వారికి చేరుతున్నాయని ఆయన అన్నారు. గత రెండున్నరేళ్లలో రూ. 1500 కోట్ల విరాళాలను తీసుకురాగలిగామని, తిరుమలలో 7,500 గదులకు 40 ఏళ్లుగా మరమ్మతులు చేయలేదని, కరోనా సమయంలో 4,500 గదులకు మరమ్మతులు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. సెప్టెంబరు నాటికి మిగతా గదులకు కూడా మరమ్మతు పూర్తిచేస్తామని తెలిపారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.