పన్నుల వసూళ్లలో జగన్ తరఫున పనిచేస్తున్న నాయకులంతా అతి చేస్తున్నారు. ఆ మాటకు వస్తే అధికారులు కూడా అస్సలు ఎక్కడా తగ్గడం లేదు.కాకినాడ కార్పొరేషన్ అధికారులు సకాలంలో పన్నులు చెల్లించకపోతే ఇంటి సామానులు సైతం పట్టుకుని పోతామని అంటూ ప్రచారం చేస్తున్నారు.ఇప్పటికే ఫ్లెక్సీలు కూడా ముద్రించి వాటిని మున్సిపల్ వాహనాలకు తగిలించి ఇంటింటి ప్రచారంలో తలమనకలయి ఉన్నారు. ఇదే ఇప్పుడు జగన్ పరువు తీస్తోంది.
రానున్న కాలానికి పన్నుల వసూలుకు సంబంధించి వెయ్యికోట్ల టార్గెట్ ను ఇచ్చింది ఏపీ సర్కారు. ఇంటి పన్ను, చెత్త పన్ను అన్నవి చెల్లించక చాలా కాలం అవుతోందని, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వానికి ఆదాయ మార్గాలే లేవని,కనీస స్థాయిలో పన్నులు విధించినా చెల్లించలేని స్థితిలో ప్రజలున్నారా అని సీఎం తరఫు ప్రశ్నలుగా వినిపిస్తున్నాయి.
వీటిపై అధికారులు సమాధానం చెప్పలేక,క్షేత్ర స్థాయిలో వస్తున్న వ్యతిరేకతను నిలువరించలేక నానా అవస్థలూ పడుతున్నారు. ముఖ్యంగా నీటి తీరువా పై ఆరు శాతం పన్ను విధించడం ఎంత మాత్రం భావ్యం కాదన్న వాదన ఒకటి బలంగానే వినిపిస్తోంది. కొన్ని చోట్ల తీరువా చెల్లించకపోతే ఆ రైతుకు సంబంధిత అధికారుల నుంచి, నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. పదేళ్లుగా నీటి తీరువా చెల్లించనందున ఎకరాకు 350 రూపాయల చొప్పున 3500 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వ అధికారులు ఆదేశిస్తున్నారు.దీనిపై ఆరు శాతం జరిమానా విధించారు.నీటి తీరువా వసూళ్ల లక్ష్యమే 650 కోట్ల రూపాయలు అని తేలింది. సాధారణంగా గ్రామాల్లో నీటి తీరువాను వసూలు చేసి పంట కాల్వల నిర్వహణకు,ప్రాజెక్టులకు సంబంధించి చిన్న,చిన్న మరమ్మతులకు వినియోగిస్తారు.
తీరువా వసూలు,సంబంధిత పనులు చేపట్టడం వంటివి నిరంతరం సాగాల్సిందే! కానీ అధికారుల అలసత్వం కారణంగా బకాయి పడ్డ రైతులకు జరిమానా విధించడం అన్నది భావ్యంగా లేదని వామపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.ఈ దశలో నీటి తీరువా వసూళ్లు అన్నవి వీఆర్వోలకు పెద్ద ఇబ్బందిగానే మారాయి.గతంలో ఎన్నడూ లేని విధంగా జరిమానాతో సహా తీరువా చెల్లించాలని చెప్పడం భావ్యంగా లేదని,అందుకే తాము ప్రతిఘటిస్తున్నామని రైతులు మరోవైపు తమ గోడు వినిపిస్తున్నారు.
ఇదే కాదు ఇంటిపన్ను వసూలులోనూ,చెత్త పన్నుల వసూలులోనూ స్థానికంగా ఇవాళ ఎంతో వ్యతిరేకత ఉంది. ఇక నాలా వసూళ్లన్నవి అయితే ఇంకా ఘోరంగా ఉన్నాయి.వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి ఇల్లు కట్టుకున్న వారందరికీ నాలా రూపంలో చెల్లించాల్సిన పన్నును ఒక్కసారిగా విధించి ఏపీ సర్కారు చుక్కలు చూపిస్తోంది. 2000లో ఇల్లు కట్టుకున్న వారికి ఇప్పుడు పన్ను పేరిట వేధిస్తున్నారని, ఆ రోజు కడతామంటే సహకరించని అధికారులు ఇప్పుడు తమను వేధించడం తగదని ఓ లబ్ధిదారుడు వాపోతున్నారు అని ప్రధాన మీడియాలో వార్తలు వెలుగు చూస్తున్నాయి. ఆ రోజు నాలా (వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకున్నందుకు చెల్లించాల్సిన పన్ను) ఇరవై వేల రూపాయలు ఉండగా,ఇప్పుడది రెండున్నర లక్షల రూపాయలుగా ఉంది.దీనికీ అధికారుల అలసత్వమే కారణం. అయినా కూడా వైసీపీ సర్కారు ఎక్కడా తగ్గడం లేదు.విమర్శలున్నా ఆదాయార్జనే ధ్యేయంగా పనిచేస్తోంది.
పన్నుల వసూళ్లలో ఏపీ యంత్రాంగం తప్పులు చేస్తుందా?#AndhraPradesh
— Manalokam (@manalokamsocial) March 21, 2022
– ట్విటర్ పోల్ – మనలోకం ప్రత్యేకం