వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వాన ధాటికి పాతబజార్లోని పురాతన భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. ఓ మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. అసలేం జరిగిందంటే..
పాతబజార్లోని ఓ పురాతన భవనం భారీ వర్షానికి కుప్పకూలింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న ఫిరోజ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన మరో ఇద్దరిని పోలీసులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. పైడి అనే వ్యక్తి చికిత్స పొందుతూ మరణించారు. సమ్మక్క అనే మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. వీరంతా మండి బజార్లో ఉన్న బహుళ అంతస్తుల భవనానికి వాచ్మెన్గా పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
కూలిన పాత భవనంలో ఓ బేకరీతో పాటు స్వీట్ హౌజ్ పూర్తిగా దెబ్బతిన్నదని పోలీసులు తెలిపారు. శిథిలాలను వరంగల్ మహానగర పాలక సంస్థ సిబ్బంది తొలగిస్తున్నారు. విషయం తెలుసుకున్న వరంగల్ తూర్పు ఎమ్మెల్యే హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనలో తండ్రీకుమారులు.. పైడి, ఫిరోజ్లు మృతి చెందినట్లు.. సమ్మక్క అలియాస్ సలీమా స్వల్పంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.