భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ యూయూ లలిత్ నియామకంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం నోటీసు జారీ చేశారు. ఆగస్ట్ 26న పదవీ విరమణ చేయనున్న సీజేఐ ఎన్‌వీ రమణ స్ధానంలో జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపడతారు. ఆగస్ట్ 27న యూయూ లలిత్ 49వ సీజేఐగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.
తన వారసుడిగా యూయూ లలిత్ పేరును సీజేఐ ఎన్‌వీ రమణ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సూచించారు. నవంబర్ 8న జస్టిస్ యూయూ లలిత్ పదవీవిరమణ చేస్తుండటంతో ఆయన సీజేఐగా కేవలం 74 రోజులు కొనసాగుతారు. 1957 నవంబర్ 9న జన్మించిన లలిత్ జూన్ 1983లో న్యాయవాద వృత్తిని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 1985 డిసెంబర్ వరకూ బాంబే హైకోర్టులో పనిచేశారు. ఆపై ఢిల్లీలో సేవలు అందిస్తూ 2004లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు జడ్జిగా బార్ ఆయనను సిఫార్సు చేయకముందు సీబీఐ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు.