విద్యార్థులకు యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ శుభవార్త చెప్పారు. యూజీసీ నెట్ డిసెంబర్ 2021, జూన్ 2022 సెషన్‌కు ఆన్లైన్ దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ ప్రకటించారు. మే 30 వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లింపులకు కూడా మే 30నే గడువుగా నిర్ణయించారు. విద్యార్థుల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ugcnet.nta.nic.in లో ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా గతంలో పేర్కొన్న నోటిఫికేషన్ ప్రకారం మే 20తో యూజీసీ నెట్ 2022 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసింది.
తాజా ప్రకటనతో దరఖాస్తు దారులకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు యూజీసీ తెల్పింది. దరఖాస్తు ఫీజు.. జనరల్ అభ్యర్థులు రూ. 1100, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 550, ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/థార్డ్ జండర్ అభ్యర్థులు రూ. 275 తప్పనిసరిగా చెల్లించవలసి ఉంటుంది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) పరీక్ష జూన్ మొదటి లేదా రెండో వారంలో నిర్వహించనున్నారు. ఐతే ఇప్పటి వరకు అధికారికంగా పరీక్ష తేదీని ప్రకటించలేదు. అడ్మిట్ కార్డుల విడుదల, పరీక్ష తేదీలను యూజీసీ త్వరలో ప్రకటించనుంది.