రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎంతో మంది ప్రాణాలు తీసింది. మరెందర్నో వికలాంగులుగా మార్చింది. ఇంకెదర్నో ఆత్మీయులను కోల్పోయేలా చేసింది. కనీసం తమ ఆత్మీయుల చివరి చూపునకు కూడా నోచుకోలేకుండా చేసింది. బతికున్న వారిని కూడా జీవచ్ఛవాలుగా మార్చింది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో పరిస్థితులు కాస్త శాంతించాయి. ప్రజలు సాధారణ జీవనానికి అలవాటు పడ్డారు.
అయితే ఉక్రెయిన్ లో పరిస్థితులు కాస్త మెరుగుపడటం వల్ల లుహాన్స్క్ రీజియన్‌లోని రూబిజ్నే పట్టణ ప్రజలు.. యుద్ధం తారస్థాయిలో ఉన్నప్పుడు హడావుడిగా ఖననం చేయించిన మృతదేహాలను వెలికితీస్తున్నారు. వాటికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 50 వేల జనాభా ఉన్న ఈ పట్టణం ప్రస్తుతం రష్యా మద్దతుకలిగిన లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్(ఎల్‌పీఆర్) ఆధీనంలో ఉంది.
యుద్ధ సమయంలో ధ్వంసమైన ఓ అపార్ట్‌మెంట్ బ్లాక్ వెలుపల ఇటీవల ఓ కందకాన్ని తిరిగి తవ్వారు. అందులోనుంచి ఆరు మృతదేహాలను వెలికితీశారు. ఈ క్రమంలోనే లిలియా అనే స్థానికురాలు.. తన తల్లి మృతదేహానికి చుట్టిన దుప్పటి ఆధారంగా ఆమెను గుర్తుపట్టారు. దాడుల సమయంలో 10 రోజులపాటు తన తల్లిదండ్రుల అపార్ట్‌మెంట్‌కు చేరుకోలేకపోయానని ఆమె వాపోయారు.
‘మా అమ్మ అప్పటికే మరణానికి చేరువైంది. ఆమె చేతులు నీలి రంగులోకి మారాయి. ముఖం వాడిపోయింది. మరుసటి రోజే ఆమె మరణించింది. అయితే.. ఎడతెగని దాడులతో అంత్యక్రియలు సరిగ్గా నిర్వహించలేని దుస్థితి. అమానవీయ పరిస్థితుల్లోనే ఆమె మృతదేహాన్ని బహిరంగ కందకంలో ఖననం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె మృతదేహాన్ని శ్మశానవాటికలో పూడ్చుతాం’ అని వివరించారు.
తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా మద్దతుగల లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్(ఎల్‌పీఆర్).. ప్రస్తుతం మృతదేహాల వెలికితీత ప్రక్రియను సమన్వయం చేస్తోంది. ఎల్‌పీఆర్ అధికారి అన్నా సోరోకినా మాట్లాడుతూ.. ఇటీవల ఒక బృందం రూబిజ్నేలో 10 రోజుల వ్యవధిలో 104 మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు. ఇలా నగరంలో దాదాపు 500 వరకు సామూహిక సమాధులు ఉన్నట్లు అంచనా వేశారు. ఇప్పటివరకు బయటపడిన మృతదేహాలకు చాలావరకు క్షిపణి, బాంబు దాడుల గాయాలున్నాయని, కొన్నింటికి బుల్లెట్ గాయాలు కూడా ఉన్నాయన్నారు. గుర్తుతెలియని మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్‌ఏ నమూనాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు.