2008, నవంబర్ 26న ముంబయిలోని తాజ్ హోటల్ వద్ద ఉన్న స్మారక మ్యూజియం వద్ద ఇవాళ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ నివాళి అర్పించారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు కూడా ముంబయి ఉగ్రదాడి మృతులకు నివాళి అర్పించారు.
ఉగ్రవాదం ఓ భూతమని, ఎటువంటి కారణాలు ఉగ్రవాదాన్ని సమర్థించలేవని గుటెర్రస్ అన్నారు. నేటి ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటులేదని తేల్చిచెప్పారు. చాలా హేయమైన ఉగ్ర దాడి జరిగిన ప్రదేశంలో ఉన్నానని, దీని పట్ల చాలా చింతిస్తున్నాని, ఆనాటి ఉగ్రదాడిలో సుమారు 166 మంది మరణించినట్లు యూఎన్ సెక్రటరీ జనరల్ గుటెర్రస్ చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటం ప్రతి దేశానికి ప్రాధాన్యత కావాలని, ఉగ్రవాదంపై పోరాటం ఐక్యరాజ్యసమితి ప్రధాన ఫోకస్ అని గుటెర్రస్ అన్నారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా యూఎన్ చీఫ్ మంగళవారం రోజున ఇండియా చేరుకున్నారు. తాజ్ హోటల్ వద్ద నివాళి తర్వాత ఆయన ఐఐటీ ముంబయిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. గురువారం గుజరాత్‌లోని కేవడియాలో ప్రధాని మోదీతో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి ఆయన నివాళి అర్పించనున్నారు. ఆ తర్వాత తొలి సోలార్ పవర్ గ్రామాన్ని సందర్శిస్తారు. మోతేరాలోని సూర్య దేవాలయాన్ని కూడా సందర్శిస్తారు.