నేను బతికుండగా పోలవరం పూర్తవ్వదు : ఉండవల్లి

-

పోలవరంపై టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ విమర్శించారు. ప్రజలు నష్టపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, బావర్‌ వంటి అంతర్జాతీయ సంస్థలకు ఏమీ తెలియదా? అని ప్రశ్నించారు.

కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడం వల్ల వచ్చిన నష్టానికి బాధ్యులెవరో నిర్ధారించాలని, తప్పు ఎవరిదో సీఎం జగన్  మంత్రి అంబటి చెప్పాలన్నారు. ఆనాడు డయాఫ్రమ్ వాల్‌ కట్టాలని చెప్పినోళ్లే.. ఇప్పుడు దాని వల్లే నష్టం జరుగుతుందని అంటున్నారని, పోలవరం నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు.

పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చెప్పిన మంత్రి అంబటి రాంబాబుకు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అభినందనలు తెలిపారు. తాను బతికి ఉండగా పోలవరం నిర్మాణం పూర్తవుతుందనే నమ్మకం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం మునిగిపోతుందని తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నారని, అసలు పోలవరం డ్యామ్ కట్టలేదు.. డ్యామ్ కట్టకుండానే భద్రాచలం మునిగిపోయిందంటున్నారన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వారిపై ప్రధాని మోదీ ఈడీ పేరుతో భయపెడుతున్నారని అన్నారు. సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ విచారణ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. లోక్ సత్తా అధినేత జయవ్రకాశ్ నారాయణ క్యాప్టిలిజమ్ వల్ల దేశానికి మంచి జరుగుతుందనే వ్యాఖ్యలను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానన్నారు. క్యాప్టిలిజమ్‌పై జయప్రకాశ్ నారాయణతో చర్చకు తాను సిద్దంగా ఉన్నానని ఉండవల్లి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news