సీఎం కేసీఆర్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానం!

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానం పంపారు. తెలంగాణ విమోచన దినోత్సవ సంబరాలకు గౌరవ అతిథిగా హాజరు కావాలంటూ సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఆ లేఖలో ఈ విధంగా పేర్కొన్నారు కిషన్ రెడ్డి.. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి నమస్కారములు, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఎందరో వీరులు, వీరాంగనలు చేసిన అనుపమైన త్యాగాలను స్మరించుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగా, మన దేశ వైభవోపేతమైన చరిత్రలో చోటు దక్కించుకోలేనటువంటి స్వాతంత్ర్య పోరాట అపూర్వఘట్టాలను గుర్తించి వాటికి సరైన గౌరవాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. భారతదేశానికి 1947, ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంలో నాటికి అస్తిత్వంలో ఉన్న 562 సంస్థానాలు భారతప్రభుత్వంలో కలిసేందుకు అంగీకారం తెలిపాయి. ఒక్క హైదరాబాద్ మాత్రమే భారత ప్రభుత్వంలో కలిసేందుకు ప్రతిఘటించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దాదాపు ఏడాది తర్వాత అంటే 17 సెప్టెంబర్, 1948లో తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకల్లోని కొన్ని ప్రాంతాలకు నిజాం అరాచక పాలన నుంచి స్వాతంత్ర్యం లభించింది. ‘ఆపరేషన్ పోలో’ పేరుతో నాటి కేంద్ర హోంమత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ సమయానుగుణంగా తీసుకున్న చర్యలవల్లే ఈ ప్రాంతాలకు విమోచనం లభించింది.

ఈ గడ్డపై పుట్టిన వ్యక్తిగా, చరిత్రపై సూక్ష్మమైన అవగాహన ఉన్న వ్యక్తిగా, నిజాంకు వ్యతిరేకంగా ప్రజల పోరాటం గురించి స్పష్టమైన ఆకళింపు కలిగిన వ్యక్తిగా.. తెలంగాణ విమోచన ఉద్యమ ప్రాముఖ్యత మీకు తెలిసిందే.
ఈ నేపథ్యంలో వివిధ చారిత్రక అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ భారత ప్రభుత్వం ‘తెలంగాణ విమోచన దినోత్సవ వజ్రోత్సవాలను’ ఘనంగా నిర్వహించాలని సంకల్పించిన విషయాన్ని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. 17 సెప్టెంబర్ 2022 నుంచి 17 సెప్టెంబర్ 2023 వరకు ఏడాది పొడగునా ఈ సంబరాలను నిర్వహించాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిశ్చయించింది.

సెప్టెంబర్ 17ను మహారాష్ట్ర ప్రభుత్వం ‘మరాఠ్వాడా ముక్తి సంగ్రామ్ దివస్’గా, కర్ణాటక ప్రభుత్వం ‘హైదరాబాద్-కర్ణాటక విమోచన దినోత్సవం’గా జరుపుకుంటున్నాయి. మూడు రాష్ట్రాల్లోని నిజాం పాలిత ప్రాంతాల్లో మన పెద్దలు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, స్వాతంత్ర్యానికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని ఘనంగా నిర్వహించుకునే అవకాశం మనకు లభించింది. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో, తెలంగాణ విమోచనంలో మన పెద్దలు చేసిన త్యాగాలను, వారి శౌర్య, పరాక్రమాలను ప్రస్తుత తరానికి తెలియజేయడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం.

ఇందులో భాగంగా, నిజాం అరాచక పాలనపై పోరాటానికి కేంద్ర బిందువుగా ఉన్న హైదరాబాద్ నగరంలో, ఏడాది పొడగునా జరిగే ఉత్సవాలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. 17 సెప్టెంబర్, 2022న హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఉత్సవాల ప్రారంభ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు అంగీకరించారు. ఈ సందర్భంలో, 17 సెప్టెంబర్, 2022న పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే కార్యక్రమంలో మీరు గౌరవ అతిథిగా పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాను.

ఇందుకు సంబంధించిన సమాచార మార్పిడి కోసం మా కార్యాలయ అధికారులు తెలంగాణ సీఎంవోతో సమన్వయ పరుస్తారని తెలియజేస్తున్నాను. దీంతోపాటుగా విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మన తెలంగాణ పోరాటయోధులను స్మరించుకునేలా కార్యక్రమాలు నిర్వహించగలరని మనవి చేస్తున్నాను. ఇంతేకాకుండా, వివిధ ప్రాంతాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై మీ అమూల్యమైన సూచనలను కేంద్ర ప్రభుత్వంతో పంచుకోగలరని కోరుతున్నాను.
ఈ మహత్కార్యంలో మీ స్పందనకై ఎదురుచూస్తున్నాను.

Read more RELATED
Recommended to you

Latest news