గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ సారి త్రిముఖ పోరు జరిగేలా ఉంది. ఎంఐఎం పార్టీకి చెందిన 7 స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో ఖచ్చితంగా బిఆర్ఎస్-బిజేపి-కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే క్రమంలో ఉప్పల్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు జరగడం ఖాయమని చెప్పవచ్చు. గత మూడు ఎన్నికల్లోనూ ఇక్కడ ట్రైయాంగిల్ వార్ నడుస్తోంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్, ప్రజారాజ్యం పార్టీల మధ్య పోరు జరగగా..అప్పుడు కాంగ్రెస్ గెలిచింది. ఆ ఎన్నికల్లో బిఆర్ఎస్-టిడిపి పొత్తులో ఉన్నాయి.
ఇక 2014 ఎన్నికల్లో బిజేపి-బిఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు జరిగింది. టిడిపితో పొత్తులో బిజేపి ఇక్కడ గెలిచింది. 2018 ఎన్నికలోచ్చేసరికి బిఆర్ఎస్-బిజేపి-కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు నడిచింది. బిఆర్ఎస్ గెలిచింది. ఇక కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా ఇక్కడ టిడిపి పోటీ చేసి ఓడిపోయింది. ఈ సారి కూడా ఉప్పల్ లో బిఆర్ఎస్-బిజేపి-కాంగ్రెస్ పార్టీల మధ్యే వార్ నడవనుంది.
యితే ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భేతి సుభాష్ రెడ్డికి పెద్దగా పాజిటివ్ లేదు. పైగా ఈయనకు సొంత పోరు ఎక్కువ ఉంది. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పడటం లేదు. రామ్మోహన్ కూడా ఈ సీటు ఆశిస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీలో ఎవరు బరిలో దిగుతారో తెలియని పరిస్తితి. ఇక బిజేపి నుంచి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ పోటీ చేయడం ఖాయం.
ప్రస్తుతం పరిస్తితులు చూస్తే మూడు పార్టీలు హోరాహోరీగా ఉన్నాయి. ఇక్కడ ఎవరు తక్కువ లేరని చెప్పవచ్చు. ఇక చివరి నిమిషంలో మారే రాజకీయ సమీకరణాలు, పరిస్తితులు బట్టి ఉప్పల్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో తెలుస్తుంది. ప్రస్తుతానికి ఉప్పల్‌లో టైట్ ఫైట్ ఉంది. ఇక టిడిపికి కాస్త బలం ఉంది..ఆ పార్టీ బిజేపికి సపోర్ట్ చేస్తే..అడ్వాంటేజ్ అవుతుంది. విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలుతాయి. అప్పుడు ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనేది చూడాలి.