తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు మరోసారి భగ్గుమన్నాయి. ఆ పార్టీ వార్ రూం కేసు అంశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇటీవల యువజన కాంగ్రెస్ వార్ రూం కేసుపై స్పందించిన ఆయన.. వార్ రూమ్ ఇన్‌ఛార్జి ప్రశాంత్‌ను వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరో తేలాలని అన్నారు. సొంత పార్టీ నేతలపై వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారం తన వరకే పరిమితం కాలేదని పలువురు కాంగ్రెస్ సీనియర్లపై కూడా ప్రశాంత్ పోస్టులు పెట్టాడని ఆరోపించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు నిఘా ఏర్పాటు చేయడంతో బంజారాహిల్స్ లో యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ నుండి ఈ పోస్టింగ్ లు పెడుతున్నారని గుర్తించారు. యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి చేసి కంప్యూటర్లు తీసుకెళ్లారు. ఈ విషయమై యూత్ కాంగ్రెస్ నేత ప్రశాంత్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ కేసులో సస్పెన్షన్ కు గురైన యూత్ కాంగ్రెస్ నేత ప్రశాంత్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ విషయమై ఉత్తమ్ కుమార్ రెడ్డి తన దృష్టికి తెచ్చారని ప్రశాంత్ మీడియాకు చెప్పారు. అయితే కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగానే ఇదంతా జరిగిందని ప్రశాంత్ చెప్పారు. ఈ విషయాలపై పోలీసుల విచారణకు సహకరిస్తామని ప్రశాంత్ మీడియాకు రెండు రోజుల క్రితం తెలిపారు.