సీబీఐ ముందు విచారణ కోసమే అవినాష్ రెడ్డి హైదరాబాద్ వెళ్లారని, సీబీఐ ముందు సాక్ష్యం చెప్పడానికి పిలిచిన 5-6 సార్లు అవినాష్ రెడ్డి విచారణకు వెళ్లారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అవినాష్ తల్లి ఆరోగ్యం బాగోలేదని, ఊహించని పరిణామంతోనే పులివెందులకు బయలు దేరారన్నారు. అవినాష్‌ను సీబీఐ అరెస్టు చేస్తారనే వార్తలు ఊహజనితాలేనని.. మరోసారి సీబీఐ విచారణకు వెళ్లేందుకూ అవినాష్ రెడ్డి సిద్దమని సజ్జల స్పష్టం చేశారు.
తల్లి అనారోగ్యం గురించి సీబీఐకి అవినాశ్ ముందే సమాచారం ఇచ్చివుంటారని సజ్జల అభిప్రాయపడ్డారు. సీబీఐ పిలిచాక ఇవాళ కాకపోయినా రేపైనా వెళ్లక తప్పదన్నారు. అవినాశ్ నేరస్థుడు కాదని, ఎక్కడికీ పోవడం లేదని, తప్పించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కానీ అవినాశ్ ను పచ్చ మీడియా వెంటాడుతోందని మండిపడ్డారు. నేరస్థుడు తప్పించుకుంటున్నాడన్నట్లుగా ఆయన కాన్వాయ్‌ను ఫాలో అయ్యారని.. ఇది సరికాదన్నారు. ఇదే సమయంలో మీడియా ప్రతినిధులపై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు.