‘వారసుడు’పై ట్రోలింగ్.. నెటిజన్లపై డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఫైర్

-

సంక్రాంతి బరిలో తమిళ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన వారసుడు సినిమా దిగింది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఓకే అనిపించినా, అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఇక ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ మూవీపై సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ నడుస్తోంది.  ఈ మూవీ నాలుగైదు టాలీవుడ్ సినిమాల మిక్చర్ అని ట్రోల్స్ చేశారు. ఇక సినిమా విడుదలైన తర్వాత ‘డైలీ సీరియల్‌’ అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం స్టార్ట్‌ చేశారు. దీనిపై దర్శకుడు వంశీ పైడిపల్లి అసహనం వ్యక్తం చేశారు.

‘‘ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా కష్టమైన ప్రక్రియ. సినిమా అనేది టీమ్‌ వర్క్‌. ప్రేక్షకులను అలరించడానికి ఎంత శ్రమపడతామో మీకు తెలుసా? సోదరా ఇదేమీ జోక్‌కాదు. ప్రతి సినిమా వెనుక ఎన్నో త్యాగాలు ఉంటాయి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న సూపర్‌స్టార్స్‌లో దళపతి విజయ్‌ ఒకరు. సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడతారు. ప్రతి పాటకు, ప్రతిడైలాగ్‌కు రిహార్సల్స్‌ చేస్తారు. మనం ఏం చేయగలమనేది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఫలితం కాదు. ఆయన నా సినిమాకు సమీక్షకుడు, విమర్శకుడు. ఆయన కోసం సినిమా చేశా’’ అని వంశీ అన్నారు.

‘వారిసు’ డైలీ సీరియల్‌లా ఉందని వస్తున్న విమర్శలపైనా స్పందించారు. ‘సినిమాను డైలీ సీరియల్స్‌తో పోల్చడం ఏంటి? సాయంత్రమైతే ఎంతమంది టీవీలు చూస్తారో మీకు తెలుసా? మీ ఇళ్లలో చూసుకోండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ధారావాహిక చూస్తారు. ఎందుకు సీరియల్స్‌ను కించపరుస్తున్నారు. అది కూడా ఒక సృజనాత్మక ఉద్యోగం’’ అని అసహనం వ్యక్తం చేశారు. సినిమా బాగోలేదంటూ విమర్శలపై కూడా వంశీ పైడిపల్లి మాట్లాడారు. ‘ఎవరినైనా కిందకు లాగాలంటే నిన్ను నీవు కిందకు లాక్కున్నట్లే. మరీ అంత నెగెటివ్‌గా ఉండకండి. మీరు నెగెటివ్‌గా ఆలోచించడం మొదలు పెడితే, అదే మిమ్మల్ని తినేస్తుంది. ఇలాంటి వాటిని నేను సీరియస్‌గా తీసుకోను. నా పనిని, నా వ్యక్తిత్వాన్ని తక్కువ చేసుకోను. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌వదిలి ఇండస్ట్రీకి వచ్చా. ఈ రోజు నేనేంటో నాకు తెలుసు. కథ ద్వారా వారు ఏం చెప్పాలనుకున్నారో  దాన్ని విశ్లేషించండి. నేనొక కమర్షియల్‌ సినిమాను తీశాను బ్రదర్‌. అంతేకానీ, నేనేదో అద్భుతమైన సినిమా తీశానని చెప్పడం లేదు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడానికే మూవీ చేశా. ‘వారిసు’ అలాగే అలరిస్తోంది’’ అని వంశీ ముగించారు.

Read more RELATED
Recommended to you

Latest news