దేశవ్యాప్తంగా ఉచితాలపై చర్చ నడుస్తోంది. ఉచిత పథకాలూ ప్రమాదకరమంటూ ఇటీవల ప్రధాని మోదీ వీటి గురించి ప్రస్తావించారు. ఎన్నికల్లో లబ్ధికి ఉచితాలను ప్రకటించడంపై సుప్రీంకోర్టు సైతం ఈ మధ్య ఆవేదన వెలిబుచ్చింది. దీనిపై చర్చించాలంటూ తాజాగా రాజ్యసభలో భాజపా ఎంపీ సుశీల్ మోదీ నోటీసులిచ్చారు.
ఈ నేపథ్యంలో అదే పార్టీకి చెందిన ఎంపీ వరుణ్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకిచ్చే ఉచితాల గురించి చర్చించే ముందు ఎంపీల పెన్షన్లు, వారికిచ్చే సదుపాయాల గురించి చర్చించాలంటూ ఆయన బుధవారం ట్వీట్ చేశారు.
ప్రజలకిచ్చే ఉచితాల గురించి చర్చించే ముందు ఎంపీలు పొందుతున్న సౌకర్యాలు, వారు పొందుతున్న పెన్షన్ల రద్దు చేయడం గురించి చర్చిస్తే బాగుంటుందని వరుణ్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఎల్పీజీ సిలిండర్ల ధరలపైనా ఆయన మరో ట్వీట్ చేశారు. పెరిగిన సిలిండర్ ధర, అరకొర సబ్సిడీ కారణంగా ఉజ్వల స్కీమ్ అసలు లక్ష్యం నెరవేరడం లేదని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో 4.13 కోట్ల మంది ప్రజలు ఒక్క గ్యాస్ సిలిండర్‌నూ రీఫిల్ చేసుకోలేదని, 7.67 కోట్ల మంది కేవలం ఒక్కసారి మాత్రమే గ్యాస్‌ను రీఫిల్ చేసుకున్నారని పేర్కొన్నారు. కేంద్రమంత్రి రామేశ్వర్ తేలి పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాధానాన్ని ఉటంకిస్తూ.. ఇలాగైతే పథకం లక్ష్యం ఎలా నెరవేరుతుందంటూ ప్రశ్నించారు.