ఇండియా ఒక గొప్ప ప్రజాస్వామ్య ద్వీపం అన్నారు విజయసాయి రెడ్డి. పైన వివరించినట్టు ప్రజాస్వామ్యం నిలకడగా లేని దేశాలున్న దక్షిణాసియాలో లేదా భారత ఉపఖండంలో ఇండియా ఒక్కటే జయప్రదంగా నడుస్తున్న ప్రజాతంత్ర దేశం. 73 ఏళ్ల క్రితం దేశాన్ని గణతంత్రరాజ్యంగా మలచిన భారతరాజ్యాంగం ఒక్కటే ఇప్పటి వరకూ అమలులో ఉంది. అవసరమైనప్పుడు దానికి కొన్ని సవరణలు జరిగాయి కాని, రాజ్యాంగాన్ని నిరంతరం అనుసరించే భారత ప్రభుత్వ వ్యవస్థ ముందుకు సాగుతోందన్నారు.
రాజ్యాంగం మౌలిక స్వరూపానికి ఎంతో పవిత్రత ఆపాదిస్తూ అన్ని వ్యవస్థలూ నడుస్తున్నాయి. ఒక్క ప్రజాస్వామ్య పంథా విషయంలోనే గాక ఆర్థిక, సామాజిక రంగాల్లో కూడా ఇండియా గణనీయ ప్రగతి సాధించింది. సామ్రాజ్యాలు, వంశాలు రాజ్యమేలిన భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్థిరంగా నడవదని, ఇది ఎన్నటికీ వేళ్లూనుకుని బలోపేతం కాలేదని పలువురు పాశ్చాత్య నిపుణులు, మేధావులు వేసిన అంచనాలు తప్పని ఈ ఏడున్నర దశాబ్దాల్లో భారత ప్రజలు రుజువుచేశారనితెలిపారు.
తాను అనేక రంగాల్లో ప్రగతి సాధిస్తూ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానానికి కిందటేడాది చివర్లో చేరుకుంది భారతదేశం. పొరుగుదేశాలైన పాకిస్తాన్, శ్రీలంక ప్రస్తుత సంక్షోభాల నుంచి కోలుకోవాలని ఇండియా అభిలషిస్తోంది. అందుకోసం తన శాయశక్తులా వాటికి తోడ్పడుతోంది. తన సరిహద్దుల్లో ‘విఫల రాజ్యాలు’ ఉండడం వాంఛనీయం కాదనే స్పృహ భారతదేశానికి ఉందన్నారు.