ఇస్రోకు దండిగా నిధులిచ్చి ప్రోత్సహించాలి : విజయసాయి రెడ్డి

-

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. అయితే.. ఒక బ్లాక్‌బస్టర్‌ సినిమా నిర్మాణానికయ్యే బడ్జెట్‌ కంటే తక్కువ ఖర్చుతో చంద్రయాన్‌ 3 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టి అంతరిక్ష ప్రయోగాల్లో భారత కీర్తి పతాకాన్ని ఎగరేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు దండిగా నిధులు కేటాయించి ప్రోత్సహించాలని వైఎస్సార్‌ సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ‘భారత అంతరిక్ష యాత్రలో మహోజ్వల ఘట్టం – చంద్రయాన్‌ విజయం’ అన్న అంశంపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, అంతరిక్ష ప్రయోగాలలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరు అభినందనీయులని పేర్కొన్నారు. భారత అంతరిక్ష కార్యక్రమాల కోసం కేవలం 2 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ మాత్రమే ఉంది. అదే అమెరికాకు చెందిన నాసాకు 62 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ ఉంది. అంటే ఇస్రో బడ్జెట్‌ కంటే అది 31 రెట్లు అధికం అన్నారు.

భారత అంతరిక్ష ప్రయోగాలలో అంగారక గ్రహంపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన మంగళయాన్ మిషన్‌ అత్యంత తక్కువ వ్యయంతో పూర్తయింది. ఇంత తక్కువ వ్యయంతోనే ప్రపంచం అబ్బురపడే అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న ఇస్రోకు దండిగా నిధులు సమకూర్చితే ఇంకా ఎలాంటి అద్భుతాలు సృష్టించగలదో నిరూపిస్తుందని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. 2023-24 కేంద్ర బడ్జెట్‌లో అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలకు కేటాయించిన మొత్తంలో 8 శాతం కోత పెట్టడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆయన ఆక్షేపించారు. గత ఏడాది అంతరిక్ష రంగానికి బడ్జెట్‌ అంచనాలలో 13,700 కోట్ల రూపాయలు కేటాయించి సవరించిన అంచనాలలో దానిని 10,530 కోట్లకు కుదించారు. అంటే 23 శాతం నిధులకు కోత పెట్టారు. సెంట్రల్‌ సెక్టర్‌ స్కీమ్‌లలో అత్యధికంగా కోతకు గురైనది అంతరిక్ష పరిజ్ఞాన రంగం బడ్జెట్‌ అని ఆయన చెప్పారు. అతి తక్కువ వ్యయంతో చంద్రయాన్‌ 3 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రపంచంలో చంద్రమండలం దక్షిణ ధృవంపై కాలుమోపిన మొట్టమొదటి దేశంగా భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరేసిన ఇస్రోకు పరిశోధనలు, ప్రయోగాల కోసం బడ్జెట్‌లో దండిగా నిధులు కేటాయించాలని విజయసాయి రెడ్డి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version