టీడీపీ పత్రికలకు గుంతలేగాని రోడ్లు అస్సలు కనిపించవని విమర్శలు చేశారు విజయసాయి రెడ్డి.
తెలుగుదేశం, ఈ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబం, ఆయన భజనపరులు, బంధుమిత్రుల ప్రయోజనాలే తమ ప్రయోజనాలుగా కొన్ని తెలుగు దినపత్రికలు భావిస్తాయి. ఉత్తమ జర్నలిజం సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ నిండా పసుపు పూసుకుని ఈ పత్రికలు అన్ని పరిణామాలను, దృశ్యాలను తమ కోణంలో వార్తలుగా ప్రచారం చేస్తాయన్నారు.
ఈ పక్షపాత పత్రికలకు తాము చూడాలనుకున్నవే కనిపిస్తాయి. పేద, సామాన్య ప్రజానీకానికి మేలు చేసే పరిణామాలు గాని, పథకాలుగాని ఈ తెలుగు పత్రికల కంట పడవు. 2019 వేసవిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఈ పసుపు పత్రికల వార్తలు చూస్తే ఎవరికైనా పై అభిప్రాయం కలుగుతుంది. అందుకే, ఏపీ ప్రభుత్వం విధానాల వల్ల లబ్ధిపొందిన సాధారణ ప్రజానీకం ఈ పచ్చ పత్రికల తప్పుడు వార్తలను, దుష్ప్రచారాన్ని నమ్మడం లేదని ఆగ్రహించారు.
ఈ పత్రికల వంకర చూపునకు, దృష్టి లోపానికి మంచి ఉదాహరణ రాష్ట్రంలోని రహదారుల స్థితిగతులపై నిరంతరం అవి చేస్తున్న వ్యతిరేక ప్రచారం. ఈ పత్రికలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసే మంచి సంక్షేమ, అభ్యుదయ పథకాలు కనిపించవు. మంచి నిర్వహణలోని రహదారులు ఎక్కడా కనపడవు. పెరుగుతున్న ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తి, ప్రగతి మార్గంలో సాగుతున్న వారి జీవనశైలి కూడా వాటి కంటపడవని పేర్కొన్నారు.