వెన్నుపోటు పొడిచి, ఎన్టీఆర్‌ వర్ధంతి జరపడం ఒక్క చంద్రబాబుకే చెల్లింది – విజయసాయి

-

వెన్నుపోటు పొడిచి, ఎన్టీఆర్‌ వర్ధంతి జరపడం ఒక్క చంద్రబాబుకే చెల్లిందని సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి. తెలుగుదేశం స్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 27వ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన టీడీపీ బుధవారం ఈ కార్యక్రమంలో నిమగ్నమైంది. 1995 ఆగస్ట్‌ మాసంలో తన మూడో అల్లుడు, అప్పటి తన మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటుతో పార్టీ అధ్యక్ష పదవిని, సీఎం పదవిని కోల్పోయారు ఎన్టీఆర్‌. కాంగ్రెస్‌ పాలనకు 1983 జనవరి 9న తెరదించిన రామారావుకు అప్పట్లో కాంగ్రెస్‌ మంత్రిగా ఉన్న చంద్రబాబు పన్నెండు సంవత్సరాల తర్వాత ఇచ్చిన బహుమతి ఇదంటూ చురకలు అంటించారు సాయిరెడ్డి.

అల్లుడు కొట్టిన కోలుకోలేని దెబ్బతో తట్టుకోలనేంత మానసిక క్షోభతో 1996 జనవరి 18న మరణించారు ఎన్టీఆర్‌. రామారావు కన్నుమూసే నాటికి చంద్రబాబు గారి తెలుగుదేశం వేరు, ఎన్టీఆర్‌ తెలుగుదేశం వేరు. రెండు టీడీపీలు అప్పుడు ఉనికిలో ఉన్నాయి. బతికి ఉండగా ఎన్టీఆర్‌ ను గద్దె దించిన చంద్రబాబు సీఎం హోదాలో మామ గారి భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయించారు. ఎన్టీఆర్‌ టీడీపీని పూర్తిగా తన తెలుగుదేశంలోకి లాగేసుకుని అప్పటి నుంచీ ఎన్టీఆర్‌ నామజపం మొదలెట్టారు నారా వారు. ఇంత జరిగినా…ఎన్టీఆర్‌ నుంచి సీఎం పదవిని, టీడీపీ అధ్యక్ష పదవిని 1995లో గుంజుకోవడాన్ని చంద్రబాబు ఇప్పటి వరకూ సమర్ధించుకుంటూనే ఉన్నారన్నారు.

ఇటీవల ఒక ఓటీటీ వేదికగా ప్రసారమైన ఓ టాక్‌ షోలో మాట్లాడుతూ, ‘పార్టీని కాపాడాలని నేను ఎన్‌ టి రామారావు గారి కాళ్లు పట్టుకుని బతిమాలడానికి సిద్ధపడ్డాను. కాని ఆయన నా మాట వినలేదు. ఆయన మంకు పట్టుదల వల్ల నాటి సంక్షోభం ఎన్టీఆర్‌ పదవీచ్యుతికి దారితీసింది,’ అని చంద్రబాబు బుకాయించడం యావత్‌ తెలుగు ప్రపంచాన్నీ తీవ్ర దిగ్భ్రాంతిలో ముంచింది. చివరి రోజుల్లో ఎన్టీఆర్‌ మానసిక క్షోభకూ, ఆయన మరణానికి తనకు ఏ మాత్రం సంబంధం లేదనే రీతిలోనే చంద్రబాబు మాట్లాడుతున్నారు. తన కారణంగా 73 ఏళ్లకే కన్నుమూసిన మహానుభావుడు ఎన్టీఆర్‌ ఇప్పుడు ఆయనకు ‘ఆరాధ్యదైవం’గా మారడం తెలుగునాట రాజకీయాల్లో చాలా పెద్ద వింత అని విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news