సీఎం కేసీఆర్ గారు దత్తత తీసుకున్న ఊరిని ఉద్ధరించే దిక్కులేదు గానీ, భారతదేశాన్ని నడిపిస్తానంటూ బీఆరెస్ పేరిట బీరాలు పలకడం విడ్డూరంగా ఉందని చురకలు అంటించారు విజయశాంతి. రెండేళ్ల కిందట దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానంటూ ఆ ఊరిని ఇప్పుడు అథోగతి పాలు చేశారన్నారు.
కొత్త లే అవుట్‌లో గ్రామంలో ఉన్న మొత్తం 570 కుటుంబాలకు 200 గజాల చొప్పున స్థలంలో ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించి రోడ్డు నిర్మాణం కోసం కొందరి ఇళ్లు కూల్చేశారు. సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రం, బడి భవనం, పంచాయతీ ఆఫీస్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులంటూ సుమారు రూ.150 కోట్లకు పైగా ప్రతిపాదనలు సర్కారుకి పంపించారు. వీటికి నేటి వరకు ఎటువంటి నిధులు రాలేదన్నారు.
చివరికి వాసాలమర్రిలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నాయి. ఊరి ప్రజలకు నూతన గృహాలు ఇస్తామన్న సర్కారు అదేమీ చేయలేదు. సరికదా, గ్రామస్థులెవరైనా తామే స్వంతంగా ఇల్లు కట్టుకుంటామన్నా అనుమతివ్వడంలేదు. గ్రామంలో కొన్నిపాత ఇళ్లు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. ఆ యజమానులు కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలని గ్రామపంచాయతీలో అనుమతి అడిగితే నిరాశే ఎదురవుతోంది. మరో ముఖ్యమైన సమస్య ఏంటంటే… నూతన లే అవుట్‌లలో 200 గజాల్లోనే ఇళ్లు కట్టిస్తామని సర్కారు చెప్పగా… అంతకన్నా ఎక్కువ స్థలం ఉండి.. ప్రభుత్వానికి అప్పగించేవారి పరిస్థితి… ఎక్కువ స్థలం ఇస్తే పరిహారం సంగతి ఏంటన్న విషయాలపై అంతా మౌనం. ఇళ్లు కూల్చి కొత్తవి నిర్మిస్తే ఆ లోగా పునరావాసం సంగతేంటో తెలియదు. ఇలా గ్రామంతో ముడిపడిన పలు అంశాలపై ఇటీవల నిర్వహించిన గ్రామసభ గందరగోళంగా మారింది. ముఖ్యమంత్రే స్వయంగా దత్తత తీసుకున్న ఊరికే దిక్కులేని పరిస్థితుల్లో దేశానికి ఇంకేం చేస్తారో ఊహించుకుంటేనే భయంగా ఉందన్నారు విజయశాంతి.