జైలు నుంచి రాజాసింగ్ బయటకు వస్తే, మునుగోడులో TRSకు ఓటమి తప్పదని హెచ్చరించారు విజయశాంతి. ప్రజల మద్దతున్న ఒక ప్రజా ప్రతినిధిని చూసి తెలంగాణ సర్కారు ఎంత వణికిపోతోందో చెప్పడానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారి అరెస్ట్ ఉదంతమే అసలైన ఉదాహరణ అన్నారు. ఒక ఎమ్మెల్యేగా… అధికార టీఆరెస్ (బీఆరెస్) అక్రమాలను అడుగడుగునా ప్రశ్నిస్తున్నందుకు రాజాసింగ్ గారిని ఎలాగైనా కట్టడి చెయ్యాలనే లక్ష్యంతో ఆయన్ని పీడీ యాక్ట్ కింద జైల్లో పెట్టించారని ఆగ్రహించారు.
పీడీ చట్టం కింద తనని అరెస్ట్ చెయ్యడంపై రాజాసింగ్ గారు హైకోర్టులో సవాల్ చెయ్యగా, ఆయన భార్య పీడీ యాక్ట్ అడ్వయిజరీ బోర్డును ఆశ్రయించారు. అరెస్ట్ చేసి నెలన్నర దాటగా… హైకోర్టు సమయం ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకూ కౌంటర్ దాఖలు చెయ్యలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. సర్కారు తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చెయ్యడమే గాక, అక్టోబర్ 20వ తేదీని తుది గడువుగా విధించింది. ఈ మొత్తం పరిణామాలని బట్టి… ఒకవేళ రాజాసింగ్ గారు బయటికొస్తే ఆయన వెల్లడించే వాస్తవాల మధ్య మునుగోడు ఉపఎన్నికలో తమకి మరిన్ని కష్టాలు తప్పవని కేసీఆర్ భయపడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోందన్నారు విజయ శాంతి.