ఏం కేసీఆర్…ఇదేనా నువ్వు తెస్తానని చెప్పిన రైతు రాజ్యం? – విజయశాంతి

-

కేసీఆర్‌ పై మరోసారి విజయశాంతి విమర్శలు చేశారు. ధరణి పోర్టల్‌తో అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నరు. కానీ, కేసీఆర్ సర్కార్ మాత్రం భూసమస్యల పరిష్కారాన్ని పక్కన పెట్టి, దానిని ఒక ఆదాయ వనరుగా మార్చుకుంది. కేసీఆర్ సర్కార్ ప్రతి దానికి రైతుల నుంచి చార్జీలు వసూలు చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటుందని ఆగ్రహించారు.

రిజిస్ట్రేషన్ చార్జీల దగ్గర నుంచి అనుకోకుండా పడిన తప్పుల వరకూ… ప్రతిదానికి ఎంతో కొంత చెల్లించేలా ధరణి పోర్టల్​ను మార్చింది. ఒకవైపు కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్న భూ సమస్యలు అలాగే ఉండిపోతుండగా… ప్రభుత్వం రాబడి తగ్గకుండా చూసుకుంటోంది. ధరణి పోర్టల్‌ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం దాదాపు రూ.1000 కోట్లు తన ఖాతాలో వేసుకుందన్నారు.

దాదాపు రెండేండ్లలోనే అన్ని రకాలుగా కలిపి ఈ ఆదాయం వచ్చింది. అప్లికేషన్ చార్జీల దగ్గర నుంచి ప్రతిదానికి ధరణిలో రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వెళ్లేలా ఫీజులున్నయి. ధరణిలో సక్సెషన్, మార్ట్​గేజ్, నాలా, పెండింగ్ మ్యూటేషన్లు, జీపీఏ, అగ్రిమెంట్ సేల్ కమ్​ జీపీఏ, లీజు వంటి ట్రాన్సా​క్షన్ల పేరుతో సొమ్ము చేసుకుంటోంది. మరోవైపు సేల్స్, గిఫ్ట్ డీడ్ ​వంటి రిజిస్ట్రేషన్ల చార్జీలతోనూ రూ.3,120 కోట్ల ఆదాయం సమకూర్చుకుందని వెల్లడించారు. సేల్, గిఫ్ట్, మార్ట్​గేజ్​లతో ప్రభుత్వానికి వచ్చేది రెగ్యులర్ ఆదాయం. కానీ ధరణి పోర్టల్ రావడంతో తలెత్తిన సమస్యలు, తప్పులతో వెనకేసుకున్న ఆదాయాన్ని కూడా ప్రభుత్వం రెగ్యులర్ ఆదాయంగానే చూస్తోంది, చూపుతోంది. ఏం కేసీఆర్… ఇదేనా నువ్వు తెస్తానని చెప్పిన రైతు రాజ్యం? అన్నదాతల బతుకులతో చెలగాటమాడుతున్న ఈ కేసీఆర్ సర్కార్‌కు వారే కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయమని హెచ్చరించారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news