కేసీఆర్ సారూ…. కమిషన్లు వచ్చే పనులే కాకుండా..మంచి పనులు చేయండని చురకలు అంటించారు విజయశాంతి.కేసీఆర్ ఎప్పుడూ చెప్పే మాట… తమది రైతు ప్రభుత్వమని. కానీ అది చేతల్లో కనిపించడం లేదని… తెలంగాణకు కాళేశ్వరమే సర్వరోగ నివారణిగా చెబుతూ పెద్ద ఎత్తున కమీషన్లు దండుకుంటున్నారని అగ్రహించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద ప్రాజెక్ట్ అయిన ఎస్సారెస్పీ ప్రాజెక్టును మాత్రం పట్టించుకోవడం లేదు. ఎస్సారెస్పీకి ఈసారి కూడా భారీగా జలాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అయితే ప్రాజెక్ట్ గేట్లు గతేడాది మొరాయించి నీరు వృథాగా పోయింది. మరి ఈసారైనా గేట్లు సరిగా పనిచేస్తాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు.
2015లో మాత్రమే ప్రాజెక్ట్‌లో నీటి మట్టం డెడ్ స్టోరేజ్‌కి చేరింది. తర్వాత మళ్లీ ఆ పరిస్థితి రాలేదు. మూడేళ్లుగా ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌లో భారీగా వరదనీరు చేరడంతో ఆయకట్టుకు సాగునీటి కొరత ఏర్పడ లేదు. 2020 జూన్ 30 వరకు ఎస్సారెస్పీలో 30 టీఎంసీల నీరు ఉండగా… గతేడాది జూన్ 14, 2021 నాటికి 26.94 టీఎంసీల నీరు ఉంది. ఈ సారి కూడా సరైన సమయానికే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయి. దీంతో వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నయి. ఈ సీజన్‌లో 6.70 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు ఆఫీసర్లు ప్రణాళికలు రెడీ చేశారు. ఎస్సారెస్సీలో మొత్తం 42 వరద గేట్లు ఉన్నయి. 90 టీఎంసీల నీటి సామర్థ్యానికి చేరగానే గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతారు. గతేడాది 610 టీఎంసీల ఇన్ ఫ్లో వచ్చింది. ఆఫీసర్ల సమన్వయ లోపం వల్ల నీటి విడుదలలో ఇబ్బందులు తలెత్తాయని అగ్రహించారు.
42 గేట్లలో 11 గేట్లు మొరాయించడంతో నీటి విడుదలలో జాప్యం జరిగింది. ఈ క్రమంలో నీరు ఎక్కువ విడుదల చేయడంతో పెద్ద ఎత్తున నీరు వృథా అయింది. దీంతో రెగ్యులర్ రిపేర్స్ ద్వారా వరద గేట్లకు సాంకేతిక లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 37 గేట్లు పనిచేసేలా రిపేర్లు పూర్తి చేశారు. మరో 5 గేట్ల రిపేర్లకు ఆఫీసర్లు టెండర్లు పూర్తి చేశారు కానీ పనులు మొదలుకాలేదు. ప్రస్తుతం వర్షాలు షురూ కావడంతో వాటి రిపేర్లు కష్ట సాధ్యమేనని తెలుస్తోంది. కేసీఆర్ సారూ…. కమిషన్లు వచ్చే పనులే కాకుండా వీటిని కూడా పట్టించుకోండి. అన్నదాతల జీవితాలతో ఆడుకుంటున్న కేసీఆర్ సర్కార్‌ను త్వరలోనే తెలంగాణ రైతాంగం బంగాళఖాతంలో కలపడం ఖాయమని హెచ్చరించారు విజయశాంతి.