కొన్ని అవమానాలు దాటుకుని., కొన్ని అవరోధాలు దాటుకుని ఆంధ్రావనిలో అధికారం కైవసం చేసుకున్న వైఎస్సార్సీపీకి ఇప్పుడిక పరీక్షా సమయం రానుంది. ముఖ్యంగా రానున్న రోజుల్లో మరింత క్రియాశీలకంగా ఆ పార్టీ నాయకులు పనిచేయాల్సి ఉంది. అంటే మండుటెండలను సైతం లెక్క చేయకుండా మే పది నుంచి గడపగడపకు వైసీపీ కార్యాక్రమం నిర్వహించాల్సి ఉంది.
ఆ రోజు పాదయాత్ర ద్వారా దక్కిన అవకాశాన్నీ, అధికారాన్నీ ఇంకా చెప్పాలంటే అదృష్టాన్నీ మరోసారి కొనసాగించేందుకు జగన్ ఆరాట పడుతున్నారు. పాలన పరమైన తప్పిదాలు దిద్దుకునే క్రమంలో ఆయన ఉన్నారు. ముఖ్యంగా కొందరు అమాత్యులు కానీ జిల్లాల ఇంఛార్జులు కానీ సరిగా పనిచేయడం లేదు అని తేలిపోయింది. అదే మాట నిన్న కూడా చెప్పారు. ఎందుకంటే చాలా మంది ప్రజా ప్రతినిధులు పదవులు దక్కలేదన్న అక్కసుతో ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. పైకి తామంతా జగనన్న విధేయులం..
మేం మళ్లీ ఆయనను అధికారంలోకి తెచ్చేందుకు, సీఎంగా చూసేందుకు, ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేందుకు కృషి చేస్తాం అని పైకి చెప్పడమే తప్ప పార్టీ వృద్ధికి పెద్దగా సహకరిస్తున్న దాఖలాలు లేవు.
ఈ నేపథ్యంలో మ్యానిఫెస్టో పట్టుకుని ఇంటింటికీ వెళ్లి పథకాల అమలు ఎలా ఉంది.. మూడేళ్లలో సాధించిన ప్రగతి లేదా అందించిన పథకాలు అందుకున్నారా లేదా అన్నది సర్వే చేయాలి. సచివాలయాలను సందర్శించాలి. నెలకు రెండు మూడు రోజులు ఎమ్మెల్యేలు అదే పనిగా సచివాలయాల సందర్శనకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంటింటికీ వెళ్లి కొన్ని విషయాలు వివరించాలి. అవి మ్యానిఫెస్టోకు సంబంధింంచినవే! అంతేకాదు పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయాలి. ఇవే మాటలు జగన్ నిన్న చెప్పారు.
అదేవిధంగా వచ్చే ఎన్నికలలో తాము విజయం సాధిస్తామని సమావేశం బయటకు వచ్చాక మరోసారి మాజీ మంత్రి కొడాలి నాని చెప్పారు. ఇదే సందర్భంలో గత ఎన్నికల్లో కైవసం చేసుకున్న 151 సీట్లు కన్నా ఎక్కువ రావాలని సీఎం చెప్పారని చెప్పారు. ఇదే పెద్ద ఇబ్బంది. ఆశకు హద్దు ఉండాలి. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న చోట్ల గెలుపు ఎలా వస్తుందని..సగానికి సగం పైగా అసెంబ్లీ స్థానాలలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. అప్పుడు జగన్ అనుకున్న విధంగానో లేదా నాని ఆశ పడుతున్న విధంగానో సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నాయి పార్టీ వర్గాలు.
మరోవైపు ఇప్పటిదాకా కార్యకర్తలే కీలకం అని చెప్పి, ఐదు వేల జీతానికి వలంటీరు ఉద్యోగం ఇచ్చారని, జీతం పెంచకుండా తమతో ఎన్నో పనులు చేయించుకుంటున్నారని సంబంధిత వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. ఎన్నాళ్లిలా అని బెంబేలెత్తిపోతున్నాయి. ఎన్నో సమస్యలు నియోజకవర్గాల్లో తిష్ట వేసి ఉన్నాయి. ముఖ్యంగా రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇవన్నీ పరిష్కరించడకుండా సీఎం జగన్ గ్రాఫ్ అరవై శాతానికి పైగా బాగుందని నాని చెబుతున్నారు. పార్టీ పరంగా స్థానికంగా నెలకొన్న సమస్యలు ఇప్పటికిప్పుడు పరిష్కృతం కావని కూడా చెబుతున్నారు.
కనుక ఆశకు హద్దు ఉండాలి. నో డౌట్ ఆయనొక రీజనల్ కో ఆర్డినేటర్ కనుక అలానే మాట్లాడాలి. కానీ వాస్తవాలు కూడా తెలుసుకుని మాట్లాడితేనే ఇంకాస్త హుందాతనంతో మాట్లాడితేనే నాని అనే వ్యక్తి చెప్పే మాటలకు ఓ విలువ మరియు నమ్మదగ్గ గుర్తింపు కూడా!