ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ.. గెలిస్తే ఒకలా.. ఓడితే మరోలా ఉంటుంది నాయకుల తీరు. ఇది ఎక్కడైనా ఉండేదే. విజయనగరం టీడీపీ రాజకీయాలు కూడా ఇలాగే కొనసాగుతున్నాయి. వరస దెబ్బలతో కుదేలైన తెలుగు తమ్ముళ్లు..కొత్త మార్పుని కోరుకుంటున్నారు. రాజుల హావాని కాదని బీసీ నినాదంతో గొంతెత్తుతున్నారు తెలుగు తమ్ముళ్లు. కొన్నాళ్లుగా టీడీపీలో వాడీ వేడీ చర్చకు దారితీస్తోన్న ఈ సమస్య ఇప్పుడు చంద్రబాబు దగ్గరకు చేరింది.
విజయనగరం జిల్లా రాజకీయాల్లో గజపతి, బొబ్బిలి రాజులదే హవా. వారిని కాదని చక్రం తిప్పేవారు లేరు. గజపతిరాజులు జిల్లా టీడీపీ రాజకీయాల్ని శాసిస్తు వస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు గత నాలుగు దశాబ్దాలుగా జిల్లా టీడీపీ రాజకీయాలను కనుసైగతో శాసించారు. టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీలో ఆయన ఏం చెబితే అదే జరుగుతుంది. అలాంటి జిల్లా టీడీపీలో ఇప్పుడు గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. అశోక్‌కు వ్యతిరేకంగా ఇతర సామాజికవర్గాలు బీసీ నినాదంతో గొంతెత్తున్నాయి.
2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన బీసీ సామాజికవర్గానికి చెందిన మీసాల గీతను కాదని మొన్నటి ఎన్నికల్లో కుమార్తెకు సీటు ఇప్పించుకున్నారు అశోక్. అప్పటి నుంచి అశోక్, గీతల మధ్య దూరం వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో తుడిచిపెట్టుకుపొయిన టీడీపీ మొన్నటి కార్పోరేషన్ ఎన్నికల్లోను కుదేలైంది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌లో టీడీపీకి ఒక్క కార్పొరేటరే గెలిచారు. విజయనగరంలో తూర్పుకాపు, యాదవ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. బీసీ నేతలను అశోక్ దూరం పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
మీసాల గీత మాజీ ఎమ్మెల్యేనే కాదు. ఉత్తరాంధ్రలో బలమైన సామాజికవర్గానికి చెందిన మహిళా నేత. మొన్నటి వరకు అశోక్ గజపతిరాజు బంగళానే పార్టీ ఆఫీస్. అసలే అశోక్ అంటే పడని మీసాల గీత ఆ మధ్య ప్రత్యేకంగా టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేయడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. ఇప్పటికే అశోక్ అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. రానున్న కాలంలో ఆయన పార్టీకి ఎంత వరకు ఉపయోగపడతారు అన్న చర్చ టీడీపీలో జరుగుతోందట.
ఒకవేళ అశోకే కావాలి అని అనుకుంటే.. కొత్తతరం నాయకులను వదులుకోవాలి. అసలే టీడీపీ నేతలపై వల వేసి కూర్చుంది వైసీపీ. తాజా రాజకీయాలను, కుల సమీకరణాలను బేరీజు వేయడంలో అశోక్ విఫలమవుతున్నారని పార్టీలో కొందరు అభిప్రాయపడుతున్నారట.