ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో భారత్ లో అలజడులు రేగుతున్నాయి.ముఖ్యంగా మన మార్కెట్లు నష్టాలతోనే ఇవాళ ఆరంభం అయ్యాయి.రెండు వేల పాయింట్ల నష్టాలతో ముంబయి స్టాక్ ఎక్స్చేంజ్ ఆరంభం అయింది.దేశీయ మార్కెట్లపై యుద్ధ ప్రభావం బాగానే ఉంది.అదేవిధంగా చమురు ధరలు, బంగారం ధరలు కూడా ఇదే సాకుతో పెరిగేందుకు ఉన్న అవకాశాలనూ కొట్టిపారేయలేం. ముఖ్యంగా భారత్ లో యుద్ధ భయాలు బాగానే ఉన్నాయి. స్టాక్ మార్కెట్ల కుదుపుల కారణంగా ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇక్కడి ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. అదేవిధంగా భారత్ జోక్యంపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.యుద్ధం తీవ్రతరం అయితే ప్రపంచ మార్కెట్ పై ఎటువంటి ప్రభావం ఉంటుందో అంతకుమించిన ప్రభావం మనపై కూడా ఉంటుందని ఇంకొందరు అంటున్నారు. అమెరికా సంబంధ మిత్ర దేశంగా భారత్ ఉంటుందా లేకా రష్యా సంబంధ మిత్ర దేశంగా భారత్ ఉంటుందా అన్న వాదనలు కూడా దేశీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించి రష్యా చేస్తున్న ఆక్రమణలను సమర్థిస్తే రేపు పాక్ ఆక్రమిత కశ్మీర్ ను కూడా సమర్థించిన వారమే అవుతామని భారత పౌరుల్లో ఆందోళన నెలకొంటోంది.కరోనా తరువాత పుంజుకుంటున్న దేశీయ మార్కెట్ల పై సెన్సెక్స్ పతనాలు, ఇంకా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ నష్టాలు తీవ్ర ప్రభావాన్నీ, అదేవిధంగా కోలుకోలేని విధంగా ధరాఘాతాన్నీ అందించి వెళ్లనున్నాయి.యుద్ధాన్ని వ్యతిరేకిస్తే రష్యాతో బంధం తెంపుకున్నవారమే అవుతాము కనుక ఆ పని వెనువెంటనే చేయడం భారత్ కు సాధ్యం కానిది. కనుక ఆ విధంగా కూడా భారత్ నాయకుల్లో ముఖ్యంగా దౌత్య సంబంధ వ్యవహారాలు చూసే అధికారుల్లో ఆందోళనలు ఉన్నాయి. ఇప్పటికే ద్వైపాక్షిక సంబంధాలు అటు రష్యాతోనూ ఇటు అమెరికాతోనూ ఉన్నాయి. కానీ కొన్ని విషయాల్లో రష్యాను గుడ్డిగా ఇప్పుడు సమర్థిస్తే ప్రపంచ శాంతికి భారత్ సహకరించని దేశంగా మిగిలిపోవడం ఖాయమన్న ఆందోళన మరియు భయం దౌత్య సంబంధ వ్యవహారాలు చూసే అధికారుల్లో నెలకొని ఉంది.