ఆడు మాములోడు కాదురా బుజ్జి.. ఆరేళ్లకే గుర్రం స్వారీ చేస్తున్న బుడతడు..!

-

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు అనేది రూల్.. వాళ్లు డ్రైవింగ్‌ చేయడం నేరం.. కానీ ఇక్కడ ఓ కిడ్‌ ఏకంగా స్వారీ చేస్తున్నాడు. గుర్రంపై స్కూల్‌కు వెళ్తున్నాడట. కేరళలోని నీలేశ్వరంలో నివాసం ఉండే దేవక్‌ చేస్తున్న ఫీట్‌లకు ఫిదా అయిపోయిన యూనివర్సల్‌ రికార్డ్‌ ఫోరమ్‌ ‘వండర్ కిడ్స్’ విభాగంలో గ్లోబల్ అవార్డు విజేతగా ప్రకటించేసింది. దైర్యంతో గుర్రపు స్వారీ చేస్తున్న ఆ బుడతడి స్కిల్‌ను గుర్తించి ఈ అవార్డు అందజేసింది.

కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన దేవక్‌ గత ఒకటిన్నర సంవత్సరంగా గుర్రపు స్వారీ చేస్తున్నాడు. తన అభిరుచికి తగ్గట్టుగానే తల్లిదండ్రులు కూడా దేవక్‌ను ప్రోత్సహించారు. ఆ బుడతడు గుర్రపు స్వారీ చేస్తుంటే ఫేమస్‌ సినిమా పాటలు మైండ్‌లో ట్యూన్ అవుతాయి. గుర్రపు స్వారీ పట్ల అతని పట్టుదల, సహనం అతన్ని గుర్రంపై స్వారీ చేసేలా చేస్తాయి. గంటకు సగటున 40 నుంచి 48 కి.మీ వేగంతో రైడ్ చేస్తాడు ఈ బుడ్డోడు.

కోవిడ్ వ్యాప్తి టైంలో బిను పరక్కత్, శృతి దంపతులు మున్నార్‌లోని వారి రిసార్ట్‌లో ఐసోలేషన్‌లో ఉండే వాళ్లు. ఆ టైంలో నాలుగున్నర సంవత్సరాల వయస్సు ఉన్న పెద్ద కుమారుడు దేవక్ బిను గుర్రపు స్వారీ చేస్తానంటూ పట్టుబట్టాడు. సరదాగా మొదలైన ఈ స్కిల్‌ తర్వాత దేవక్‌ను ప్రత్యేక స్థానంలో ఉంచింది. సందర్శకులు స్వారీ చేయడం కోసం ‘కర్ణన్’ అనే తెల్లని గుర్రాన్ని రిసార్ట్‌కు తీసుకొచ్చారు. దానిపై స్వారీ చేయాలన్న కుతూహలంతో తల్లిదండ్రులను ఒప్పించి స్వారీ స్కిల్ నేర్చుకున్నాడు.

తమ రిసార్ట్‌లో ఉండే సంరక్షకుల పర్యవేక్షణలో దేవక్‌ స్వారీని నేర్చుకున్నాడు. ఎనిమిది నెలల కాలంలో గుర్రపు స్వారీలో ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నాడని అతని తండ్రి బిను తెలిపారు. కరోనా సడలింపులు తర్వాత ఇంటికి వచ్చినప్పటికీ గుర్రపు స్వారీపై తన ఇష్టాన్ని వదల్లేదు. రోజులు గడిచిన కొద్దీ గుర్రాన్ని కొనివ్వాలని పట్టుబట్టాడు.

కొడుకు ఆసక్తిని చూసి.. తల్లిదండ్రులు మలయత్తూర్‌లోని టోలిన్స్ వరల్డ్ స్కూల్‌లో ట్రైనర్ అయిన రఫీక్‌ని కలిసి…బెంగుళూరు నుంచి తెచ్చిన తన కొత్త గుర్రం ‘రాణి’తో శిక్షణ ప్రారంభించారు. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల తర్వాత, దేవక్ 5 కిలోమీటర్ల పాటు రద్దీగా ఉండే ట్రాఫిక్ మధ్య హైవే వెంట గుర్రపు స్వారీ చేశాడు. గత వారం వండర్ కిడ్స్ విభాగంలో URF ప్రపంచ గుర్తింపును గెలుచుకున్నాడు.

రద్దీగా ఉండే హైవే వెంట రోజూ గుర్రపు స్వారీ చేస్తూ పాఠశాలకు వెళ్తున్న దేవక్‌ను చూసినవాళ్లంతా షాక్‌ అవుతున్నారు. అతని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news