అదే తెలంగాణ రాష్ట్ర సమితి
ఆ పార్టీని కాదని మరో పార్టీ రాదు
రాలేదు కానీ వస్తే బాగుంటుంది
ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల నిర్మాణం
జరిగితే ఇంకా బాగుంటుంది
అందుకు చీపురు పార్టీ ఓ ప్రత్యామ్నాయం అయితే
ఇంకా బాగుంటుంది .. ఆమ్ ఆద్మీ పార్టీ రాకతో
తెలంగాణలో వచ్చే మార్పులు మరియు కూర్పులు
కేసీఆర్ కు ప్రతిబంధకం అయితే ఇంకా బాగుంటుంది
అవుతాయా?
తెలంగాణ రాజకీయాల్లోకి చీపురు పార్టీ రావడానికి ప్రయత్నిస్తోంది.ఆమ్ ఆద్మీ పార్టీ దక్షిణాదిలో తన మొదటి లక్ష్యాన్ని తెలంగాణపైనే పెట్టిందని తెలుస్తోంది.ఇక్కడ నుంచే దక్షిణాదిలో పాగా వేసేందుకు కేజ్రీవాల్ సిద్ధం అవుతున్నారు. అసలు కొత్త పార్టీలకు తెలంగాణలో స్పేస్ ఉందా..? అనేది అసలు ప్రశ్న.ఇప్పటికే తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ అధికారంలో ఉంది. అఖండ మెజారిటీతో రాష్ట్రాన్ని పాలిస్తోంది.మరోవైపు బీజేపీ కూడా తెలంగాణపై ప్రత్యేక నజర్ పెట్టింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ గత రెండు పర్యాయాలు అధికారానికి దూరం అయింది.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోె తప్పకుండా అధికారంలోకి రావాలని ఇటు కాంగ్రెస్, అటు టీఆర్ఎస్ రెండు భావిస్తున్నాయి.
మరోవైపు మొన్నటి వరకు ఢిల్లీకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది.117స్థానాలకు గానూ 92 స్థానాలు దక్కించుకుని ఆప్ బంపర్ విక్టరీ కొట్టింది. ఇక రాబోయే ఎన్నికలపై కాన్సన్ట్రేట్ చేస్తోంది ఆప్.రాబోయే గుజరాత్ ఎన్నికలతో పాటు హర్యానా,హిమాచల్ ప్రదేశ్ లో పాగా వేసేందుకు ఉవ్విళ్లూరుతోంది.పంజాబ్ తరహా ఫలితాలనే మళ్లీ క్రియేట్ చేయాలని అనుకుంటోంది.తాజాగా దక్షిణాదిపై కూడా ఫోకస్ పెట్టింది ఆప్. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజు ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ తెలంగాణలో పాదయాత్ర ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్ల పరిశీలనకు ఇతర పనులకు ఆప్ కీలక నేత సోమనాథ్ భారతిని తెలంగాణకు ఇంఛార్జ్ గా నియమించారు.
ఆప్ పార్టీ తెలంగాణలో తన సత్తా చాటుతుందా…? అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న.ప్రస్తుతం అయితే ఆప్ కు తెలంగాణలో కీలక నాయకుడు లేదు.అందులో ఉన్న నాయకుల పేర్లు కూడా తెలంగాణ జనాలకు తెలియదు.ఎప్పుడో ఆప్ గెలిచినప్పుడు కనిపించే కార్యకర్తలు తప్పితే..నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్మించిన అనుభవం తెలంగాణలో ఆప్ కు లేదు.పార్టీ ఎదుగుదలకు కావాల్సింది..కార్యకర్తలను నడిపించే ఓ మాస్ లీడర్.కానీ తెలంగాణ ఆప్ లో ఇప్పటి వరకు అలాంటి లీడరే లేడు. రానున్న ఎన్నికల వరకు తమ నాయకత్వాన్ని పటిష్ట పరుచుకోవాలి.వాస్తవానికి పంజాబ్ లో ఉన్న పరిస్థితులు వేరు..తెలంగాణ పరిస్థితులు వేరు. పంజాబ్ కు అనుకునే ఢిల్లీ ఉంది..అక్కడ ఈరెండు రాష్ట్రాల సంబంధ భాందవ్యాలు వేరు. ఢిల్లీలో ఆప్ పాలన ప్రభావం పంజాబ్ పై ఉంటుంది.ఇది కాక ఇటీవల రైతు ఉద్యమం సమయంలో రైతులకు ఫెవర్ గా వ్యవహరించింది.ఇది కూడా పంజాబ్ లో ఆప్ గెలుపుకు కారణం అయింది.ఇటువంటి అనుకూలతలేవీ ఆప్ తెలంగాణలో ఇప్పటిప్పుడు ఎదగడానికి లేవు.తెలంగాణలో ఎదిగేందుకు ఇప్పటికిప్పుడైతే ఆప్ కు పెద్దగా స్కోప్ లేదనే చెప్పవచ్చు.అలాగని ప్రయత్నాలను విస్మరించాల్సిన అవసరం కూడా లేదు.ఎందుకంటే..ఎలాంటి బేస్ లేకున్నా.. గోవాలో ఆప్ రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుందనేది గుర్తుంచుకోవాలి.మరోవైపు తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తే టీఆర్ఎస్,బీజేపీ,కాంగ్రెస్ పార్టీలను కాదని కొత్త పార్టీలు తెలంగాణలో ఎదిగేందుకు పెద్దగా అవకాశాలు లేవు. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ పర్యటన తర్వాత ఏమైనా మార్పులు వస్తాయో చూడాలి.