ఈ టీచర్ ది ఎంత గొప్ప మనసు.. ఏకంగా పెళ్లి మండపం పైనే.. !

మామూలుగా పిల్లలకు చదువు చెప్పే టీచర్లు విద్యార్థుల భవిష్యత్తు విషయంలో ఎంతో బాధ్యత గా ఉంటారు. కొన్నిసార్లు విద్యార్థులకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదురైనా తమ పిల్లలను చూసుకున్నట్లుగానే సమస్యలు తీరుస్తూ ఉంటారు. ఇలా ఎంతో మంది ఉపాధ్యాయులు తమ పెద్దమనసు చాటుకుంటూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్న టీచరమ్మ కేవలం విద్యార్థులకు సహాయం చేయడమే కాదు ఎంతో మంది ప్రాణాలను కాపాడేందుకు సంకల్పించింది.

కరోనా వైరస్ సంక్షోభం సమయంలో సదరు టీచర్ చేసిన గొప్ప పనికి ఎంతోమంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన ఉపాధ్యాయురాలు నూర్జహాన్ తన పెళ్లి వేదికనే రక్తదాన శిబిరం గా మార్చేసింది. ముర్షిదాబాద్ కి చెందిన ఉపాధ్యాయురాలి కి తోటి ఉపాధ్యాయుడితో పెళ్లి నిశ్చయమైంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా వివిధ ప్రాంతాల్లో రక్తం కొరత ఉంది అని తెలుసుకున్న నూర్జహాన్ ఏకంగా పెళ్లి వేదికనే రక్తదాన శిబిరం గా మార్చేసింది. పెళ్లికి హాజరైన 32 మంది బంధువుల నుంచి రక్తదానం చేయించింది. ఆ తర్వాతే పెళ్లి పీటలెక్కి పెళ్లి చేసుకుంది టీచరమ్మ.