మంచి వాడు మా జగన్ అని చెప్పుకోవడంతో ఆరంభం అయిన రాజకీయం ఎక్కడో ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ సాగింది. జగన్ మంచి వాడు ఉదారవాది అని చెప్పుకోవడంతో ఎక్కడో ఆరంభం అయిన ప్రస్థావన తరువాత తరువాత ప్రస్థానం దాకా వచ్చింది.దీనినే ప్రజా ప్రస్థానం అని కూడా అనాలి.అయితే ఇవాళ జగన్ ఎలా ఉన్నారు.ఆయన ప్రభావితం చేస్తున్న తీరు ఎలా ఉంది.. అన్నవి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా పాలనలో కీలక ఘట్టం రానే వచ్చింది. మరో రెండేళ్లు ఆగితే ఎన్నికలు.అయినా జగన్ చాలా కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. సాధించి సాధించి తీరుతాం అని ఉపాధ్యాయ సంఘాలు అన్న విధంగానే ఇవాళ జగన్ కూడా అంటున్నారు.
జగన్ తీసుకున్న లేదా తీసుకుంటున్న నిర్ణయాలు బాగున్నాయా అని ముందు ఆలోచిద్దాం.ఆయన పార్టీ నేపథ్యం వాటి మనుగడ అన్నవి తరువాత. కాంగ్రెస్ నుంచివచ్చి పిల్ల కాంగ్రెస్ అని మొదట అనిపించుకున్నా తరువాత తరువాత కాంగ్రెస్ కు చుక్కలు చూపించి ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేసింది. ఇవాళ జిల్లా కార్యాలయాలు ఉన్నా కూడా అవేవీ మనుగడలో లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఓ దయనీయతను మోస్తోంది.అందుకు ఇక్కడ జగన్ కారణం. అక్కడ అనగా తెలంగాణ వాకిట జగన్ స్నేహితులు కేసీఆర్ మరియు కేటీఆర్ కారణం.
ఇక నిర్ణయాలు ఎలా ఉన్నాయి అన్నది చూద్దాం.ముందుగా రాజధాని నిర్ణయంలో అస్సలు మెచ్యూరిటీ లేదని తేలిపోయింది. ప్రజా తీర్పునకు అనుగుణంగా వచ్చి రాజధాని ప్రభావిత ప్రాంతాలలో కూడా అనూహ్య మెజార్టీ సాధించి అసెంబ్లీకి పోయిన ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా అమరావతి రైతుల సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవు. అదేవిధంగా సీఆర్డీఏ రద్దు అన్నదే ఓ అపరిపక్వ నిర్ణయం.ఇవాళ్టికీ ఆయనకు వీటిపై స్పష్టత లేదు.
3 రాజధానుల డ్రామా కొనసాగినంత కాలం వైసీపీకి ఢోకా ఉండదు.ఇదే సమయంలో న్యాయ స్థానాలు ఆయనను నిలువరిస్తున్నా పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు.ఇదే ఇవాళ జగన్ కు మైనస్.మిగతా తప్పిదాలు చాలానే ఉన్నాయి.ఆయన దేనినీ వినిపించుకోరు..ఆయన విమర్శను ఒప్పుకోరు అని సీనియర్ నాయకులు సైతం అనేది ఇందుకే ! ఏదేమయినా 12ఏళ్ల ప్రయాణంలో ఇవాళ కొంత పరిణితి సాధించి ఉంది అని అనుకుని మిగతా కాలంలోఅయినా నిన్నటి తప్పిదాలు చేయకుండా ఉంటే మేలు అని భావించి జగన్ కు ఆల్ ద బెస్ట్ చెబుదాం.