సందర్భం : ఏప్రిల్ 28,2022 – గురువారం – బాహుబలి విడుదలయి ఐదేళ్లు.
ఓ పెద్ద ప్రపంచాన్ని సృష్టించాక బాహుబలి నిర్మాతలు రిలాక్స్ అయిపోయారు. మరో పెద్ద ప్రపంచాన్ని సృష్టించే పనిలో మళ్లీ పడాలని అనుకుంటున్నారా లేదా రామోజీ ఫిల్మ్ సిటీ కేంద్రంగా నాటి బాహుబలి సెట్ ను వృథా చేయకుండా ఓ సీరియల్ ను నిర్మించి తరువాత తమ హవాను అక్కడితోనే ఆపేశారా? ఏమో ! మొత్తమ్మీద ఇప్పుడు వాళ్లు పూర్తిగా సైలెంట్ మోడ్ లోనే ఉన్నారు. ట్రిపుల్ ఆర్ వరకూ కూడా పెద్దగా వీళ్లు ప్రొడక్షన్ సైడ్ వర్క్ చేసింది ఏమీ లేదు.
భారీ బడ్జెట్ సినిమాలు చేసిన అనుభవం పెద్దగా ఆ రోజు వీళ్లకూ లేదు అదేవిధంగా ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తో సందడి చేసిన డీవీవీ దానయ్యకూ లేదు. అయితే దానయ్య మాదిరిగా ఎక్కువ ఒత్తిడి అనుభవించినా ఆ రోజు ఉన్న పరిస్థితుల రీత్యా, మీడియా సృష్టించిన మానియా దృష్ట్యా బాహుబలి రెండు భాగాలూ మంచి వసూళ్లే దక్కించుకుంది. కానీ వీళ్లు మాత్రం తమకేమీ దక్కలేదనే ఓ ఇంటర్వ్యూలో తేల్చేశారు. బయర్లు హ్యాపీ అండి కానీ మాకు పెద్దగా మిగిలింది ఏమీ లేదు. పోనీ వీళ్లకు మిగల్లేదు సరే శాటి లైట్ రైట్స్ ను దక్కించుకున్న వాళ్లకు అయినా ఏమయినా మిగిలాయా ?
ఐదేళ్ల కిందట ఇదే రోజు బాహుబలి 2 విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదలయి మంచి వసూళ్లు సాధించి విజయ తీరాలకు చేరుకుని, ఇండస్ట్రీ కి ఓ బాక్సాఫీసు బొనాంజాను అందించింది. అటుపై ఈ సినిమా తరువాత ఆ సినిమా నిర్మాతలు ఏమయ్యారు. ఇదే పెద్ద సందేహం. మరియు సందిగ్ధం. బాహుబలి లాంటి సినిమాలు చేశాక ఆర్కా మీడియా అదే ట్రెండ్ ను కొనసాగించలేకపోయింది. అదేవిధంగా ట్రిపుల్ ఆర్ కు కూడా పెద్దగా మద్దతు ఇవ్వలేకపోయింది.
బాహుబలి పైకి చెప్పుకోదగ్గ ఆర్థిక విజయం ఏమీ తమకు ఇవ్వలేదు అని కొనుక్కున్న వాళ్లే హాయిగా ఉన్నారని ఓ సందర్భంలో ఆర్కా అధినేతలు ప్రసాద్ మైనేని, శోభు యార్లగడ్డ చెప్పారు. ఈ సినిమా తరువాత కేరాఫ్ కంచరపాలెం ఫేం వెంకట్ మహాతో ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య అనే సినిమాను తీశారు. ఇది మలయాళం సినిమాకు రీమేక్. సత్యదేవ్ హీరోగా ఈ సినిమా వచ్చింది. వెళ్లింది కానీ ఆర్థికంగా మరీ అంత పేరు కానీ వసూళ్లు కానీ తెచ్చుకోలేకపోయింది.
ఈ సినిమా తరువాత పెళ్లిసందడిని మళ్లీ తెరపైకి తెచ్చారు. కానీ సీక్వెల్ నెరేషన్ పెద్దగా పేరు తెచ్చుకోలేదు. గౌరీ రోణంకి అనే అమ్మాయికి అవకాశం ఇచ్చారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. శ్రీకాంత్ కొడుకు రోషన్, బబ్లీ గాళ్ శ్రీ లీల ఇద్దరూ కూడా డెబ్యూ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా కూడా సో సోగానే ఆడింది. టేకింగ్ పరంగా కొత్త అమ్మాయి అయినా అంతటా రాఘవేంద్రరావు మార్క్ ఉన్నా కూడా సినిమా కాస్త పర్లేదు అని టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు వాళ్లెక్కడ ? ఆ రోజు చిన్నారుల కోసం బాహుబలి కామికల్ వరల్డ్ ను (కార్టూన్ నెట్ వర్క్ ) తీసుకువస్తామని, అదేవిధంగా స్టోరీ బుక్స్ తీసుకువస్తామని రాజమౌళీతో సహా నిర్మాతలు ఇవే మాటలు మీడియాతో చెప్పారు.
అదేవిధంగా ఇంకా ఏవేవో చేస్తామని అన్నారు. అయితే బాహుబలి 3 కూడా ఉంటుందని ఆ మధ్య హింట్ కూడా ఇచ్చారు రాజమౌళి. అదే నిజం కానుందా ? అందాక వీళ్లు సీరియల్స్ ను రూపొందించడంపైనే దృష్టి సారించనున్నారా అన్నదే ఇప్పుడిక ఆసక్తిదాయక పరిణామం. ఐదేళ్ల తరువాత బాహుబలి 2 నిర్మాతలు ఎలా ఉన్నారు.. ఏం చేస్తున్నారు అన్న ప్రశ్నలకు పూర్తి స్థాయి జవాబులు అయితే ఇంకా రాలేదు. వాళ్లే చెప్పాలి. భవిష్యత్ లో ఏం చేయనున్నారో అన్నది. ఇది కేవలం ప్రాథమిక సమాచారం ఆధారంగా మాత్రమే రాసిన కథనం.