ప్రజల గుండెలు ఏమవ్వాలా? ఆ మాటలు వింటే..! ఏందయ్యా బాబూ.. ఆ మాటలేంది.. ఆ సెప్పడమేందంట..! ఇప్పటికే ఆడ పెజల ఆరోగ్గెం అంతంతంగా ఉందాయే.. ఇట్టాంటి తరుణంలో మాట్టాడాల్సిన మాటలేనా అవి? అంటే ఏం మాట్టాడినా చెల్లిపోయిద్దనుకుంటున్నారా? ఏంది? కనీం ఇనేటోళ్లకైనా… దేవుడా.. ఏడుకొండలవాడా.. వెంకటరమణా.. నీదేనయ్యా భారం అంటూ ఎలాగోలా బతికేత్తంటే ఇట్టా మీరు బాంబులేత్తే మా గతేమవ్వాలా? ఓరి దేవుడా.. మీరు కాసేపు ఆగండ్రా నాయనా!!.
సగర్వంగా ఆరోస్థానం
తిరుపతి లోక్‌సభకు 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఆరోస్థానంలో నిలబడింది. కాషాయజెండాపై పోటీచేసిన డాక్టర్ బొమ్మి శ్రీహరిరావుకు 16వేల ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాదరావుకు 7,17,924 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి 4,90,605 ఓట్లు సాధించారు. వైసీపీ మెజార్టీ 2.28 లక్షల ఓట్లు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో తిరుపతిపై కమల పతాకాన్ని రెపరెపలాడిస్తామని చెపుతోన్న నేతలకు ఈ విషయం గుర్తులేదనుకుంటా. వైసీపీ, టీడీపీ తర్వాత మూడోస్థానం నోటా సంపాదించింది. మాకెవరూ నచ్చలేదంటూ 25,750 ఓట్లు పోలవడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. కాంగ్రెస్ తరఫున పోటీచేసిన మాజీ ఎంపీ చింతా మోహన్ 23,926 ఓట్లతో నాలుగోస్థానం, జనసేన మద్దతిచ్చిన బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు 20,847 ఓట్లతో ఐదోస్థానంలో నిలిచారు. ఆరోస్థానం భారతీయ జనతాపార్టీ దక్కించుకుంది.
గెలిపిస్తానని ఇల్లు అద్దెకు తీసుకున్నారు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్ తిరుపతిలో కాషాయజెండాను ఎగరవేయడానికి అక్కడే ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నారు. ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో జాతీయస్థాయి నేతలు కూడా బాగానే రాకపోకలు సాగించారు. కపిలతీర్థంకాదు.. రామతీర్థం అన్నారు. మాటల తూటాలు వదిలారు. జగన్, చంద్రబాబుపై నిప్పులు కురిపించారు. గెలవబోయేది తామేనని డాంబికాలు పలికారు. ప్రచారాన్ని హోరెత్తించారు. ఇదంతా బయట అనుకునేరు.. సోషల్ మీడియాలోనే. క్షేత్రస్థాయిలో బలం లేదు. జనసేన మద్దతు ఉంటుందా? లేదా? అనే గ్యారంటీ లేదు. కానీ తిరుపతిలో విజయఢంకా మోగిస్తామని చెబుతున్నారు. ఆ చెప్పడం కూడా అలా.. ఇలా కాదు. వినేవాళ్ల గుండెలు అదిరిపోయేలా చెబుతున్నారు.
జంబో కమిటీ ఏర్పాటు
నోటిఫికేషన్ విడుదలై, ఇతర పార్టీల అభ్యర్ధులు నామినేషన్లు మొదలైన తర్వాత కూడా బీజేపీ ఎన్నికల హడావిడి మొదలవలేదు. తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో 8 డివిజన్లలో పోటీచేస్తే వచ్చిన ఓట్లు 250. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏమిటి? ప్రచార పటాటోపంతో ఒక జంబో కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో జాతీయ స్థాయి నేతల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకున్నారు. ప్రజలవద్దకు వెళ్లిన నేతలు మాత్రం లేరు. ఏకంగా తిరుపతిని గెలిచేస్తామని చెబుతోంది ఆపార్టీ. ఈసారైనా నోటాను దాటితే అదే గొప్ప అంటున్నారు తిరుపతి ప్రజలు. చూద్దాం ఏం జరుగుతుందో!!.