ఔను! తిరుపతిలో గెలుపు ఎవరిది ? ఇప్పుడు ఏపీలోను ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోనూ ఇదే చర్చ సాగుతోంది. ప్రధానంగా బీజేపీ-జనసేన కూటమి పార్టీ.. ఇక్కడ పోటీకి ఉవ్విళ్లూరుతున్న సమయంలో తిరుపతి ఉప ఎన్నిక ఓ రేంజ్‌కు చేరింది. నిజానికి టికెట్ విషయంలో ఈ రెండు పార్టీలూ పోటీ పడుతున్నాయి. ఎవరికి వారు మాకంటే మాకేనని పోటీ పడుతున్నారు. మేం గ్రేటర్‌లో త్యాగం చేశాం కనుక తిరుపతి బైపోల్‌ను మాకు వదిలేయాలని పవన్ షరతు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే.. తిరుపతిని వదులుకునేందుకు బీజేపీ ఇష్టపడడం లేదు. సరే… ఎవరో ఒకరు పోటీ చేయకతప్పదు కనుక.. ఎవరు పోటీ చేసినా.. గెలిచే సత్తా ఈ రెండు పార్టీలకూ ఉందా? అనేది చర్చ.
గడిచిన రెండు ఎన్నికలను తీసుకుంటే.. 2014లో బీజేపీ-టీడీపీ కలిసి పనిచేశాయి. వీటికి జనసేనాని పవన్ మద్దతు ప్రకటించారు. తిరుపతి నుంచి బీజేపీ పోటీ చేసింది. టీడీపీ దానికి మద్దతు ఇచ్చింది. పవన్ కూడా ప్రచారం చేశారు. ఏకంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న(అప్పట్లో) నరేంద్ర మోడీ కూడా రంగంలోకి దిగారు. హోరా హోరీ పోరు సాగింది. అయినప్పటికీ.. ఇక్కడ బీజేపీ గెలుపు గుర్రం ఎక్కలేక పోయింది. ఇక, గత ఏడాది ఎన్నికలకు వస్తే.. ఎవరికి వారుగా బరిలో దిగారు. బీజేపీ తన అభ్యర్థిని నిలబెట్టింది.
ఇక, జనసేన తనకు అభ్యర్థిలేక పోవడంతో.. దీనిని బీఎస్పీకి కేటాయించింది. అయినా.. ఈ రెండు పార్టీలూ.. కనీసం డిపాజిట్లు దక్కించుకోలేదు. నిజానికి పవన్ సెంటిమెంటుగా తిరుపతిని భావిస్తారు. అలాంటి చోటే.. ఈ రెండు పార్టీలూ.. గత ఎన్నికల్లో సత్తా చాటలేక పోయాయి.. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయాయి. ఇక, ఇప్పుడు కలిసిపోటీ చేస్తానని ప్రకటిస్తున్నాయి. అభ్యర్థి విషయం తేలిపోగానే బరిలో దిగి ప్రచార పర్వం కూడా ప్రారంభిస్తాయి. దాదాపు బీజేపీనే ఈ టికెట్ దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
అదే జరిగితే.. పవన్ ప్రచారానికి దూరంగా ఉంటారని అంటున్నారు. లేదు.. పనిగట్టుకుని ఒత్తిడి తెచ్చి.. పవనే ఇక్కడి టికెట్ దక్కించుకుంటే.. బీజేపీ నేతలు ప్రచారం చేస్తారా? అనేది చూడాలి. ఎందుకంటే.. వేరే పార్టీ వారి తరఫున ప్రచారం చేసే సంస్కృతి బీజేపీకి లేదు. ఎంత పొత్తులో ఉన్నా.. బిహారంలో ఆర్జేడీ నేతల తరఫున బీజేపీ ప్రచారం చేయలేదు. ఇప్పుడు ఇదే సీన్ వస్తుందని అంటున్నారు పరిశీలకులు. మొత్తంగా బీజేపీ-జనసేన కలిసి పోటీ చేసినా.. గెలుపు గుర్రం ఎక్కేంత సీన్ వీళ్లకు లేదు.
ఇక టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పోటీ నుంచి తప్పుకుంటారన్న వార్తల నేపథ్యంలో తిరుపతిలో ఎలాంటి సంచలనాలు లేకుండా వైసీపీ సులువుగా గెలిచే పరిస్థితే ప్రస్తుతం ఉంది.