ప్లాస్టిక్ బాటిల్ ఎందుకండీ..? ప్రత్యామ్నాయాలు బోలెడు ఉన్నాయిగా..!

-

వాటర్ బాటిల్ అనగానే.. మనకు ప్లాస్టిక్ బాటిలే గుర్తుకువస్తుంది. ప్లాస్టిక్ వద్దురా బాబూ అని మొత్తుకుంటున్నా కానీ.. నేడు చాలా మంది ఇళ్లలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లనే వాడుతున్నారు. ఇక ఆ బాటిళ్లలో నీటినే.. బయటకు వెళ్లినప్పుడు తీసుకెళ్లడం వల్ల ఎండ వేడికి.. అందులో ఉండే ప్లాస్టిక్ రసాయనాలు నీళ్లలో కలుస్తాయి. అవి కాస్త మనం తాగటం వల్ల ఆరోగ్యానికి లేనిపోని ఇబ్బందులు.. ప్లాస్టిక్ బాటిళ్లు వద్దంటే..అందుకు ఆల్టర్ నేటివ్.. రాగి, గాజు సీసాలు అనుకుంటారు. ఇవే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు అవేంటో చూద్దామా..!

 

ప్రత్యామ్నాయాలు !

ప్లాస్టిక్‌కు బదులు ప్రస్తుతం విభిన్న రకాల పర్యావరణహిత బాటిల్స్‌ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే..!

సెరామిక్ బాటిల్స్‌ – ప్రస్తుతం మార్కెట్లో విభిన్న డిజైన్లలో ఇవి సందడి చేస్తున్నాయి. గాజు లాగే ఇవి కూడా నీళ్లు ఎక్కువ సేపు చల్లగా ఉంచుతాయి.

స్టీల్‌ బాటిల్‌ – వాతావరణాన్ని బట్టి ఇందులో నిల్వ చేసిన నీటి ఉష్ణోగ్రతలు మారుతుంటాయి. అలాగని ఈ వేడికి లోహం కరిగి నీళ్లలో కలిసిపోతుందన్న భయం అక్కర్లేదు.

పేపర్‌ బాటిల్స్‌ – కొన్ని రకాల పండ్ల రసాలు, పాలను ఈ తరహా పేపర్‌ ప్యాక్స్‌లో నింపడం మీరు చూసే ఉంటారు. ఈ బాటిల్స్‌ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి

మట్టి బాటిల్స్‌ – ఇటు పర్యావరణహితంగా, అటు నీళ్లు ఎక్కువ సమయం చల్లగా ఉండాలంటే మట్టితో చేసిన వాటర్‌ బాటిల్స్‌ మంచి ప్రత్యామ్నాయం. మట్టి కుండలే కాదు.. మట్టి బాటిల్స్ కూడా వచ్చేశాయి.. ఇందులోని నీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రస్తుతం ఈ తరహా బాటిల్స్‌ విభిన్న డిజైన్లు, ప్రింట్లతో రూపొందించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు డిజైనర్లు.

వెదురు బాటిల్స్‌ – ఇది వాతావరణానికి మేలు చేయడంతో పాటు చాలా తక్కువ బరువును కలిగి ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో ఈ తరహా బాటిల్స్‌ని ఎంచుకోవచ్చు.

పాకెట్‌ మగ్‌ – నీళ్ల బాటిల్‌ను వెంట తీసుకెళ్లలేని వారు.. సిలికాన్‌తో తయారయ్యే పాకెట్‌ మగ్‌ని ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు.. ఇవి చేతిలో ఇమిడిపోయేలా ఉంటాయి. వీటిని వెంట ఉంచుకుంటే.. మంచి నీటి సదుపాయం ఉన్న చోట నేరుగా వాటిలో నీళ్లు పట్టుకొని తాగేయచ్చు.

కాపర్‌ బాటిల్స్‌ – శరీరంలోని విషతుల్యాలను బయటికి పంపించడంతో పాటు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి, బరువును అదుపులో ఉంచడానికి కాపర్‌ బాటిల్స్‌లో నిల్వ చేసిన నీళ్లు చాలా మంచివి..

కాబట్టి వీటిల్లో ఏదో ఒకటి ఎంచుకోవడం ఉత్తమం.. ఎందుకండీ.. ఆ ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం..! ఇటీవలే విడుదల చేసిన ‘నేషనల్‌ జియోగ్రాఫిక్‌’ సర్వే నివేదిక. ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం వల్ల క్రమంగా హార్మోన్ల సమస్యలు, పీసీఓఎస్‌, అండాశయ సమస్యలు, రొమ్ము క్యాన్సర్‌, పెద్ద పేగు క్యాన్సర్‌.. వంటి వివిధ రకాల అనారోగ్యాలకు కారణమవుతుందని సర్వేలో తేలింది.

ప్లాస్టిక్‌లోని బైఫినైల్‌-ఎ అనే రసాయనం ఈస్ట్రోజెన్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తద్వారా డయాబెటిస్‌, స్థూలకాయం, సంతానలేమి సమస్యలు, అమ్మాయిలు చిన్న వయసులోనే రజస్వల కావడం, ప్రవర్తన లోపాలు.. వంటిని ఎన్నో వస్తాయి. థాలేట్స్‌ అనే రసాయనాలు ప్లాస్టిక్‌లో ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయ క్యాన్సర్‌కు దారితీస్తాయి. వినియోగదారుల్ని ఆకట్టుకోవడానికి ఈ మధ్య విటమిన్‌ వాటర్‌ పేరుతో ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో నీళ్లు నింపి అమ్ముతున్నారు. నిజానికి ఇవి మరింత హానికరం అంటున్నారు నిపుణులు.ఫుడ్‌ డైలు, ఫ్రక్టోజ్‌ కార్న్‌ సిరప్‌.. వంటి హానికారక పదార్థాలు ఇందులో కలిసే అవకాశం ఉందట.

Read more RELATED
Recommended to you

Latest news